పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/55

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వద్ద కర్నూలులో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. వెల్లాల శంకరశాస్త్రిగారి వద్ద సంస్కృతకావ్యాలు, వ్యాకరణం చదువుకొన్నారు. నిజాం కాలేజీలో ఎఫ్.ఎ. మద్రాసు ప్రెసిడెన్సి కాలేజిలో బి.ఏ. చదివిన తర్వాత బి.ఎల్. చదివి న్యాయవాద వృత్తిని చేపట్టారు. కాని వారు ఎంతో కాలం ఆ వృత్తిలో ఉండలేకపోయారు.

భారత దేశంలో గాంధీజీ నాయకత్వంలో సాగుతున్న స్వాతంత్ర్యపోరాటం వారిని ఆకర్షించింది. తెలంగాణా ప్రజల దైన్యం, దారిద్ర్యం, ప్రాథమిక హక్కులను కూడా నోచుకోని దుస్థితి చూచి చలించి పోయారు ప్రతాపరెడ్డిగారు. మాతృభాషలో చదువుకొనే అవకాశాలు లేవు. అంతా ఉర్దూమయం. నిజాం నిరంకుశ పరిపాలన. నిద్రాణమైన తెలంగాణాను జాగృతం చేయాలని దీక్ష వహించారు రెడ్డిగారు.

ఆనాటి నైజాంలో తెలుగు భాషకు, సంస్కృతికి పట్టుగొమ్మగా ఉండిన వారు రాజా బహదుర్ పింగళి వెంకటరామారెడ్డిగారు. ప్రతాపరెడ్డి గారిని వారు 1924లో హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్ కార్యదర్శిగా నియమించారు. వెంకటరామారెడ్డిగారు కొత్వాలు (నేటి పోలీస్ కమీషనర్) గా ఉండేవారు. ప్రతాపరెడ్డిగారు హాస్టల్ విద్యార్ధులలో క్రమశిక్షనను నెలకొల్పి వారిని చైతన్య వంతులను కావించారు. పేరుకు రెడ్డి హాస్టల్. కాని అన్ని కులాల వారికి ప్రవేశం ఉండేది. ఆ హాస్టల్ లో విలువైన పుస్తకాలతో చక్కని గ్రంథాలయాన్ని ప్రారంభించారు.

హైదరాబాద్ సంస్థానంలోని తెలుగు ప్రజల విజ్ఞానానికి తెలుగులో పత్రికను ప్రారంభించాలని నిశ్చయించారు. హాస్టల్ కార్యదర్శి పదవిని మానుకొన్నారు. రాజా బహదుర్ గారి ఆశీస్సులతో 1926 మే 10వ తేదీన 'గోలకొండ' పత్రికను ప్రారంభించారు. ఆ పత్రిక వారానికి రెండు మార్లు వెలువడుతుండేది.

పత్రికలోని ఒక సంపాదకీయంలో "మేము మా పత్రికాస్థాపన కాలం నుండి రెండు అంశాలను దృష్టిపథంలో ఉంచుకొని దేశీయుల సేవ చేస్తున్నాము. మొదటిది ఆంధ్ర భాషా సేవ, రెండవది జాతి, కుల వివక్షత లేక నిష్పక్షపాతముగా ఆంధ్రులలో సర్వశాఖల వారి యొక్క సత్వరాభివృద్ధికి పాటుపడుట" అని వ్రాసి పత్రిక ఆశయాలను వెల్లడించారు. పత్రికా నిర్వహణలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. జాతీయ భావాలను ధైర్యంగా ప్రచారం చేశారు. 1947 ప్రాంతంలో అది దిన పత్రికగా మారింది. పోలీస్ చర్య వరకు ప్రతాపరెడ్డిగారు 'గోలకొండ' పత్రికా సంపాదకులుగా పనిచేసారు. వారి తర్వాత నూకల నర్వోత్తమ రెడ్డిగారు, రాజా రామేశ్వరరావు గారు కొన్నాళ్ళు పత్రికను నిర్వహించారు. 1966 దాకా పత్రిక నడిచింది. కొంతకాలం దేవులపల్లి రామానుజరావుగారు కూడా సంపాదకులుగ పనిచేశారు.

ప్రతాపరెడ్డిగారు సంస్కృతం, తెలుగు, ఉర్దూ, ఆంగ్లభాషలలో గొప్ప పండితులు. కాశీనాథుని నాగేశ్వరరావుగారు, తెలుగు దేశంలొ మొట్టమొదటి రాజకీయ ఖైదీ గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు సురవరం వారికి స్నేహితులు. ఆ కాలంలో సభలు సమావేశాలు జరుపుకొనడం చాలా కష్టం. ఆ పరిస్థితిని ' వాగ్బంధన శాసన శృంగార తాండవ విశేషం ' అన్నారు ప్రతాపరెడ్డిగారు.