పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతి కనుమ దగ్గర కొంత కట్టుబడి సిబ్బందిని కాపలా వుంచాడు.

నరసింహారెడ్డి 5 వేల బలగంతో పాట్సన్‌ను గిద్దలూరు వద్ద అడ్డుకున్నాడు. పాట్సన్ వద్ద సైనికులు వందమందే. ఆరు గంటలసేపు నరసింహారెడ్డి మనుషులకు, పాట్సన్ సైన్యానికి భీకర పోరాటం జరిగింది. నరసింహారెడ్డి మనుషులు 200 మంది మరణించారు. చీకటి పడటతో యిరుపక్షాల వారు తమదారిన తాము వెళ్ళిపోయారు.

కొండలలోని కాలిబాటలు అడ్డదారులు సైనికులకు పరిచయం లేవు. నరసింహారెడ్డి మనుషుల కోసం సైన్యం కొండలన్నీ గాలించింది. గ్రామాధికార్ల మీద, కట్టుబడిదార్ల మీద కేసులు మోపారు.

నరసింహారెడ్డి పాలెగాణ్ణి పట్టిస్తే వేయి రూపాయలు, అతని ముఖ్య సలహాదారు గోసాయి వెంకన్నను పట్టిస్తే వంద రూపాయలు బహుమానాన్ని ఇస్తామని ప్రభుత్వ ప్రకటించింది.

నరసింహారెడ్డి తన కుటుంబాన్ని కొత్త కోటకు తరలించాడు. ప్రభుత్వ సైనికులు ఆ ప్రాంతంపై దాడి జరిపినపుడు హైదరాబాద్ రాజ్యంలోని ప్రాతకూరు జమీందారు లాల్‌ఖాన్‌కు, నరసింహారెడ్డి మధ్య జరిగిన ఉత్తరప్రత్యత్తరాలను పట్టుకున్నారు. ఆ పత్రాలు విచారణలో ప్రభుత్వానికి బలమైన సాక్ష్యాలయ్యాయి.

నరసింహారెడ్డికి ముగ్గురు భార్యల ద్వారా ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్ళూ ఉండేవారు. నరసింహారెడ్జి కుటుంబాన్ని పట్టుకుని ప్రభుత్వం, వారిని కడపలోని ఒక బంగళాలో వుంచారు. మెరుపుదాడి చేసి కుటుంబ సభ్యులను విడిపించాలని కొండలమీదుగా ప్రయాణం చేసి కడప చేరాడు నరసింహారెడ్డి.

1846 అక్టోబర్ 6వ తేదీన ఎర్రమల నలమల కొండల మధ్యనున్న పేరసామల లోని జగన్నాధాలయంలో రెడ్డి ఉన్నాడని తెలుసుకున్న కలెక్టర్ కాక్రేన్ నలుదిక్కులా సైన్యాన్ని మొహరించి 40, 50 మంది నరసింహారెడ్డి మనుషులను కాల్చి చంపారు. వందమంది దాకా గాయపడ్డారు. కాలికి గుండు దెబ్బ తగలడంతో రెడ్డి ఫిరంగి దళాలకు పట్టుబడినాడు.

నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో ఔకు రాజు తమ్ముడొకడు.

కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి, నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు. అది మామూలు శిక్ష కాదు. ఉరి తర్వాత అతని శిరస్సును కోయిలకుంట్ల దగ్గర బురుజుపై గొలుసులతో బంధించి తూకుమానుకు వేలాడదీయవలసిందిగా తీర్పు.

1827 ఫిబ్రవరి 22 న ఫలానాచోట ఉదయం 7 గంటలకు నరసింహారెడ్డిని