భారత ప్రభుత్వ రుణ పత్రాలను ఇచ్చి తాకట్టు పెట్టుకోమన్నారు. మేనేజర్ ఆశ్చర్యంతో "తాము తాకట్టు పెట్టడమా! ఇది మీరు నెలకొల్పిన బ్యాంక్" అంటూ తిప్పి ఇవ్వగా విశ్వేశ్వరయ్య తీసుకోలేదు. బ్యాంకు వారు తక్కువ వడ్డీ సూచించగా - అందరికీ విధించే వడ్డీ వేయమన్నారు. ఎక్కువ వడ్డీ వేయమని కోరిన వారు విశ్వేశ్వరయ్య గారొక్కరే, అన్నారు బ్యాంక్ మేనేజర్.
విశ్వేశ్వరయ్య వ్యక్తిగత జీవితం అతి క్రమశిక్షణతో వుండేది. రెండు సార్లు భార్యావియోగం కల్గింది. మూడోసారి పెళ్ళాడిన భార్య వ్యవహారం నచ్చక ఆమెకు విడాకులిచ్చారు. కాల నియమాన్ని, ఆహార విహార నియమాలను కచ్ఛితంగా పాటించిన విశ్వేశ్వరయ్య 100 సం. వయస్సులో కళ్ళద్దాలు లేకుండా చదివేవారు. "గంధపు చెక్క వలె సేవలొ అరిగిపో, కాని ఇనుములా తుప్పు పట్టవద్దు." అనునది వారి జీవన ధ్యేయం. దేశ విదేశాలలోని విశ్వవిద్యాలయాలు వారిని సత్కరించాయి. 1961లో విశ్వేశ్వరయ్య గారి శతజయంతి ఉత్సవాలకు భారత ప్రధాని నెహ్రూ విచ్చేశారు." మేము మాటలతో కాల యాపన చేశాం. మీరు నిరంతర క్రియాశూరులై నవభారత నిర్మాణానికి కృషి చేసిన మహనీయు" లంటూ నివాళులర్పించారు నెహ్రూ.
భారత ప్రభుత్వం విశ్వేశ్వరయ్యగారిని 'భారతరత్న' బిరుదంతో సత్కరించింది. విశ్వేశ్వరయ్య ప్లాన్‌డ్ ఎకానమి ఆఫ్ ఇండియా రికన్‌స్ట్రక్టింగ్ ఇండియా, మెమాయిర్స్ ఆఫ్ మై వర్కింక్ లైఫ్ (ఆత్మకథ) రచించారు.
జీవితాంతం దేశ ప్రగతికి, ప్రజా శ్రేయస్సుకు కృషి చేసిన విశ్వేశ్వరయ్యగారు 12-4-1962న దివంగతులయ్యారు.