పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తొలి తెలుగు రాజకీయ ఖైదీ

గాడిచర్ల హరిసర్వోత్తమరావు

"వందేమాతరమనగనే వచ్చితీరు ఎవనిపేరు?
వయోజన విద్య అనగనే వచ్చి తీరు ఎ‌వరిపేరు?
గ్రామగ్రామమున వెలసెడి గ్రంథాలయ మెవనికి గుడి?
అరగని తరగని వొడవని అక్షర దానం బెవనిది?
అరువదేండ్లు ప్రజలకొరకు అరిగిన కాయంబెవనిది?
తన బరువును మోయలేని తనువును చాలించెనెవడు?
తరతరాలు ఎవనిమేలు తరలుచు పొరలుచు నుండును?
అందరికెవనితో పొత్తు - అఖిలాంద్రంబెవని సొత్తు
ఏస్థాన కవిని నేనో, ఆస్థానాధీశుడెవడు?
వయోవృద్ధుడగు యువకుడు వాస్తవ జీవిత మతనిది
హరిసర్వోత్తముడాతడు ఆంధ్రులపాలిటి దేవుడు"

--కాళోజి నారాయణరావు

ఆంధ్ర దేశంలో స్వాతంత్రోద్యమ వైతాళికులుగా, ప్రప్రథమ ఆంధ్ర రాజకీయ ఖైదీగా నిస్వార్ధ నిరాడంబర ప్రజాసేవకులుగా విద్యావేత్తగా, త్యాగమూర్తిగా విఖ్యాతులైన దేశభక్తులు శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు.

లోకమాన్య బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ గార్లచే ప్రభావితులైన శ్రీ గాడిచెర్ల విద్యార్థిదశలోనే , స్వరాజ్యోద్యమంలో సమరోత్సాహంతో పాల్గొని యువతనుత్తేజ పరచిన దేశభక్తులు.

ఆయన జననం 14-9-1883. వారి పూర్వీకులు కడపజిల్లా సింహాద్రిపురం గ్రామానికి చెందినవారు. శ్రీ రావుగారు పుట్టింది కర్నూలులో. కర్నూలు, గుత్తి, నంద్యాలలో ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసి, మద్రాసు క్రైస్తవ కళాశాలలో విద్యార్ధి వేతనం పొంది 1906లో ఎం.ఏ. డిగ్రీ సంపాదించారు. ఉపాధ్యాయ శిక్షణ నిమిత్తం 1907 లో రాజమండ్రిలోని టీచర్స్ ట్రైనింగ్ కాలేజీలో ఎల్.టి. చదువుతుండగా స్వరాజ్యోద్యమంలో దూకారు.

ప్రభుత్వ ఆంక్ష

భారత స్వాతంత్ర్యోద్యమ త్రిమూర్తుల (లాల్, బాల్, పాల్) లో ఒకరైన బిపిన్ చంద్రపాల్, రాజమండ్రి వచ్చి అక్కడ చేసిన ఉపన్యాసప్రభావం కాలేజి విద్యార్థులపై పడింది. విద్యార్ధులు 'వందేమాతరం' బ్యాడ్జిలతో క్లాసుకు వెళ్లారు. ప్రిన్సిపల్ మార్క్