పుట:Sukavi-Manoranjanamu.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అంబరీష మహారాజును, ఆయన పుత్రికైన శ్రీమతి యందు నారద పర్వతులను దేవమునులకు అనురాగోదయమై, ఉభయులు తమ కిమ్మని కోరితే, శ్రీమతి యెవరిని వరించితే వారికి వివాహ మొనరించుతానని అంబరీషు డనగా, శ్రీమన్నారాయణమూర్తి వద్దకు వెళ్లి శ్రీమతి చూపులకు ఒకడు కోతియు, నొకడు కొండముచ్చువలె కనిపించేలాగు చెయ్యమని ప్రార్థించితే, ఆ ప్రకారమే భగవంతులు వరమిచ్చినందున, శ్రీమతి వరించనందున, శ్రీమన్నారాయణమూర్తి యెవరెఱుంగకుండ (శ్రీమతిని) పాణిగ్రహణము చేసి వైకుంఠముకు తీసుకువెళ్లితే, భగవన్మాయ తెలియనేరక, రాజు తమను వంచించినాడనుకుని, యిద్దరు మునులు ‘మోహము నిన్ను కశ్మలము చేసుగాక ' యని శపించితే, మునిశాపము కొట్టివెయ్య(రాని) దనిన్ని, అంబరీషుని యందున్న దయచేత రాజుకు శాపము తగలకుండగ 'ముందు నేను దశరథపుత్రుడ కాగలను. అప్పుడు నన్నావరించమని ఆ శాపమును మరలించి, యిపు డవలంబించి కాముకాగ్రణివలె నటించినాడు (శ్రీ మన్నారాయణావతారమైన శ్రీరామచంద్రమూర్తి). ఇది లింగపురాణ ప్రసిద్ధి. 483
జగ్గకవి సుభద్రాపరిణయము
చ.

కనుగవ నశ్రుబిందువులు గ్రమ్మఁగ గద్గదకంఠియై మొగం
బునఁ గడువిన్నబా టొదవ ముప్పిరి గొన్వలవంతఁ బల్కె నో
జనవరచంద్ర యో నయవిశారద యో జనరంజనైకశో
భనతరరూప యో ఘనకృపా యిటు లాన తిడంగఁ జెల్లునే.

484
‘ఘనకృపా' యనుచోట రోదనప్లుతము. అందరును వర్గయతి యనుకుందురు. పవర్ణముపై ప్లుతమున్నది గాన వర్గముకాదు. ప్లుతమైనా దూరాహ్వాన మనరాదు. నాయకసమీపవర్తియై యున్నది గాన, గానప్లుత మనరాదు. ( ఎందుకనగా) ‘కనుగవ నశ్రుబిందువులు గ్రమ్మఁగ గద్గదకంఠియై మొగంబునఁ గడువిన్నబా టొదవ ముప్పిరి గొన్వలవంత...' ఈ పదములచేత రోదనమే ముఖ్యము (గాన). వ్యాజస్తుతి యనే కాకుస్వరయతి యనరాదు, నాయకునికి కరుణ పుట్టుటకై వచించుచున్నది గాన. కరుణారసమునకు శోకము స్థాయీభావము.