పుట:Sukavi-Manoranjanamu.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అచ్చుకు
అడిదము సూరకవి 'కవిజనరంజనము'
సీ.

అనుగుబిడ్డల భంగి ననుజీవులను బ్రోవు
             మిలవేలుపులను గొల్వు మేమరకను
పతికి ముం దనుభవింపకు మే పదార్థంబు
             జవదాటకుము నిజేశ్వరుని మాట
మగఁడు గావించిన మన్నన కుబ్బకు
             మఱి కృశింపకు మవమానమునకు
నవనిసురాభ్యాగతార్థికోటుల నెల్ల
             నాప్తబంధువులయ ట్లాదరింపు
కరుణగల్గుము బంధువర్గముల కెల్ల
గురుజనంబుల సద్భక్తి గొలుపు మెపుడు
దైవమన్నను గురువన్న ధర్మమన్న
ప్రాణనాథుండు సుమ్ము మాయమ్మకాన.

76
ఇటువలెనే తెలుసుకునేది. 77

9. చతుర్థీ విభక్తి విరామము

లక్షణము
గీ.

తనరు నచ్చు హల్లులకుఁ గై యను విభక్తి
తివిరి పదముపై నిడఁ జతుర్థీ విరామ
మంజలి యొనర్తు శశిమౌలికై మురారి
కై సమర్పింతు విరులనఁ గలుషధమన.

78
ఆంధ్రశబ్దచింతామణి యందలి
సూ.

కొఱకు కై చతుర్థ్యాస్తః

అను సూత్రము వలన చతుర్థికి 'కై' యను వర్ణము సిద్ధము. ఆ వర్ణము అచ్చుకు చెల్లునని కొందఱి మతము. హల్లుకు చెందునని కొందఱి మతము. రెండును గలవు. హల్లుకు సులభము. 79