పుట:Subhadhra Kalyanamu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుభద్రా కల్యాణము

తాళ్లపాక తిమ్మక్క రచన.

శ్రీరమావల్లభులు - శ్రీకృష్ణు లెలమి
ద్వారకాపట్టణము - తమ రేలుచుండ
శ్రీకాంతపతికృపను - జెలగి పాండవులు
ప్రాకటంబుగను ద్రౌ - పదిని బెండ్లాడి
రంత నింద్రప్రస్థ - మను పట్టణమున
సంతసంబున నున్న - సమయంబునందు
సురముని యేతెంచె - సుదతి పూజించె
అరలేక మ్రొక్కగా - నపుడు ద్రౌపదిని
దీవించి లోపలికి - దిరిగి పొమ్మనియె
నేవురితోఁబలికె - నిట్లు నారదుడు
ఇంతుల కథలైన - నెంతవారికిని
చింతింప మదిలోన - చీకాకు గదురు
సుదతికై సుందోప - సుందుల చరిత
విదితముగ జెప్పెదను - వినుడంచు బలికె
సుందరికొఱకునై - సూడు పుట్టంగ
సుందోపసుందులు - మ్రంది మన్నైరి