Jump to content

పుట:Stree Neetideepika.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.గీ. ధర నసత్యంబు లాడుట తథ్యముగను
బాపముల కెల్ల మూలంబు పడఁతులార!
కాన,సత్యంబె పలుకుఁడు; దాన మీకు
నొదవు నిహపర సౌఖ్యముల్ కొదవలేక. 11.

తే.గీ. ఆతివ! యొకదానిలోఁ గల్లలాడితేని,
నెవ్వరును నమ్మ కుండుదు రెపుడు నిన్ను;
నమ్మకము చెడ్డవెనుకను సరులలోన
జీవనము చేయకంటెను జావు మేలు. 12.

ఆ.వె. తల్లిదండ్రు లొకట దండింతు రెఱిఁగిన;
మగనివంకవారు తెగడు చుంద్రు;
తోడివారు మిగుల దూషింపు చుందురు;
కల్ల లాడి తేని కలువకంటి! 13.

తే.గీ. చెలువ! యెపుడైనఁ దప్పింత చేసి తేని,
నొకట మాఱుమాటాడక యొప్పుకొమ్ము.
పొలఁతి! నీతప్పు దాఁచంగ బొంకితేని,
కానిపను లొక్కటికిని రెండౌనుజుమ్ము. 14.
                      సత్సహవాసము

తే.గీ. తొలుత నెటువంటివారలచెలిమి గలుగు
నట్టివారలగుణములే యబ్బుఁగాన
బాలికలు నిత్యమును మంచివారితోనె
చెలిమిఁ దప్పక చేయంగవలయుఁ జుమ్ము. 15.

తే.గీ. జారిణులతోడ, సరిగానివారితోడఁ,
దార్చువారితో, దాసీవితతులతోడ,
వరుస దుర్గుణములు గల్లువారితోడ,
మైత్రి యొనరింపఁజెల్లదు మగువ కెపుడు. 16.