పుట:Sri Suryaraya Vidyananda Library-Pithapuram.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రంథాలయ శతవార్షికోత్సవ సందర్భములో

శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం 1915 లో స్థాపించినప్పటినుంచీ పండితులు, కవులు, విద్యావేత్తలు, సాహితీపరులు, విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంచుకుంటూ అనేకమందికి పంచుతూ సామాజికంగాను, వ్యక్తిగతంగాను ఎంతో అభివృద్ధి సాధించి, ప్రపంచవ్యాప్త ప్రఖ్యాతి పొందారు. ఆంధ్రభాషకు వన్నె తెచ్చిన శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు పురాతన తాళపత్ర గ్రంథములు, ప్రఖ్యాతి పొందిన రచనలు, పరిశోధకులకు ఉపకరించు సమాచారముతో కూడిన అనేక పుస్తక సంపదతో విరాజిల్లుతూ వంద సంవత్సరాలు పూర్తి చేసుకొంటున్న ఆధునిక దేవాలయం మన గ్రంథాలయం.

నా చిన్నతనంలో సాయంత్రంవేళ ఎన్నో గంటలు ఈ గ్రంథాలయ ఆవరణలో చదువుకోవడం మరచిపోలేని ఘట్టం. అటువంటి గ్రంథాలయ పాత భవనం శిథిలమయిపోయి పడిపోతున్న తరుణంలో గ్రంథాలయం కూడా ఒక దేవాలయంగా భావించి గ్రంథాలయానికి శాశ్వత భవనం సొంత నిధులతో నిర్మించి ది. 21-9-2001 తేదీని పిఠాపురం ప్రజలకు అంకిత మివ్వడమైనది. గ్రంథాలయ శాశ్వత నిర్వహణ నిమిత్తం దుకాణాల సముదాయం కూడా నిర్మించి వాటి అద్దెలకు ఆదాయము ద్వారా నిరాటంకముగా జరుగుటకు ఏర్పాటు చేయడమైనది.

ప్రస్తుతం గ్రంథాలయం నూరు వసంతాలు పూర్తి చేసుకొని శతవార్షికోత్సవాలు జరుపుకుంటున్న శుభ తరుణంలో నేను గ్రంథాలయ అధ్యక్షునిగా, కార్యవర్గసభ్యుల సహకారంతో గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి పధంలోకి తీసుకెళ్ళడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాము. భావితరాలకు గ్రంథాలయ సంపదను అందించే విధంగా మీయొక్క సహాయ సహాకారాలు అందించగలరని ఆశిస్తూ శతవార్షికోత్సవ శుభాకాంక్షలతో...


బాదం మాధవరావు
అధ్యక్షులు