శ్రీ మహాభాగవతము
ద్వితీయ స్కంధము
క. శ్రీమద్భక్త చకోరక, సోమ ! వివేకాభిరామ ! సురవినుత గుణ
స్తోమ ! నిరలంకృతాసుర, రామా సీమంతసీమ ! రాఘవరామా ! (1)
అధ్యాయము - 1
వ. మహానీయ గుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణవ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె. అట్లు పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుండిట్లనియె. (2)
సీ. క్షితిపతి ! ప్రశ్నంబు | సిద్ధంబు మంచిది యాత్మవేత్తలు మెత్తు | రఖిలశుభద
మాకర్ణనీయంబు | లయుతసంఖ్యలు గల, వందు ముఖ్యం బిది | యఖిలవరము
గృహములలోపల| గృహమేధులగు నరు, లాత్మతత్త్వము లేశ | మైన నెఱుఁగ
రంగనారతుల ని | ద్రాసక్తిఁ జను రాత్రి, పోవుఁ గుటుంబార్థ | బుద్ధి నహము
ఆ. పశు కళత్ర పుత్ర | బాంధవ దేహాది, సంఘమెల్లఁ దమకు | సత్యమనుచు
గాఁపురములు సేసి కడపటఁ జత్తురు, కనియుఁ గాన రంత్య | కాలసరణి. (3)
క. కావున సర్వాత్మకుఁడు మ, హావిభవుఁడు విష్ణుఁ డీశుఁ | డాకర్ణింపన్
సేవింపను వర్ణింపను, భావింపను భావ్యుఁ డభవ | భాజికి నధిపా ! (4)
ఆ. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము దాని, వలన ధర్మ నిష్ఠ | వలన నైన
నంత్యకాలమందు హరిచింత సేయుట, పుట్టువునకు ఫలము | భూవరేంద్ర ! (5)
తే. అరసి నిర్గుణబ్రహ్మంబు | నాశ్రయించి, విధి నిషేధము లొల్లని | విమలమతులు
సేయుచుందురు హరిగుణ | చింతనములు, మానసంబుల నెప్పుడు | మానవేంద్ర ! (6)