84
తే. నుండుమనరాదు గురుఁడవు యోగివిభుఁడ, వరయ మొదవున బిదికిన యంత
తడవుగాని దెస నుండవు కరణతోఁడ, జెప్పవే తండ్రి ముక్తికిఁజేరుతెరువు. (523)
వ. అని పరీక్షిన్న రేంద్రుండు బాదరాయణి నడిగె నని చెప్పి. (524)
క. రాజీవపత్ర లోచన ! రాజేంద్ర కిరీటఘటిత రత్న మరీచి
భాజిత పాదాంభోరుహ ! భూజనమందార ! నిత్య పుణ్యవిచారా ! (525)
మాలిని. అనుపమ గుణహారా ! హన్యమానారివీరా !
జన వినుత విహారా ! జానకిఇ చిత్త చోరా !
దనుజ ఘనసమీరా ! దానవ శ్రీ విదారా !
ఘన కలుషకఠోరా ! కంధి గర్వాపహారా ! (526)
గద్య. ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర, కేసనమంత్రి పుత్త్ర, సహజపాండిత్య, పోతనామాత్య ప్రణీతంబైన, శ్రీమహాభాగవతం బను మహాపురాణంబు నందు, నైమిశారణ్య వర్ణనంబున, శౌనకాదుల ప్రశ్నంబును, సూతుండు నారాయణావతార సూచనంబు సేయుటయు, వ్యాసచింతయు, నారదాగమనంబును, నారదుని పూర్వకల్ప వృత్తాంతంబును, పుత్రశోకాతురయైన ద్రుపద రాజనందన కర్ణునుం డశ్వత్థామను దెచ్చి యొప్పగించి విడిపించుటయు, భీష్మ నిర్యాణంబును, ధర్మనందను రాజ్యాభిషేకంబును, గోవిందుని ద్వారకాగమనంబును, విరాటకన్యకాగర్భ పీడ్యమానుండైన యర్భకు నశ్వత్థామ బాణానలంబువలనం బాసి విష్ణుండు రక్షించుటయు, పరీక్షిజ్జన్మంబును, గాంధారీ ధృతరాష్ట్ర విదుర నిర్గమంబును, నారదుండు ధర్మజునికిఁ గాలసూచనంబు సేయుటయు, కృష్ణావతార విసార్జనంబు విని పాండవులు మహాపథంబునం జనుటయు, దిగ్విజయంబు సేయుచు నభిమన్యుపుత్రుండు శూద్రరాజ లక్షణుండగు కలిగర్వంబు సర్వంబు మాపి గో వృషాకారంబుల నున్న ధరణీ ధర్మదేవతల నుద్ధరించుటయు, శృంగిశాపభీతుండై యుత్తరానందనుండు గంగాతీరంబునం బ్రాయోపవేశంబున నుండి శుకదర్శనంబు సేసి మోక్షోపాయం బడుగుట నను కథలగల ప్రథమస్కంధము సంపూర్ణము. (527)
ప్రథమస్కంధము సమాప్తము
హరిః ఓమ్ తత్సత్