51
మ. గదఁ జేఁ బట్టి పరిభ్రమించుచు గదాఘాతంబునన్ దుర్భయ
ప్రదమై వచ్చు శరాగ్నిఁ దుత్తుమురుగా భంజించి రక్షించు నీ
సదయుం డెవ్వఁడొకో! యటంచు మదిలోఁ జర్పింపుచున్ శాబకుం
డెదురై చూడు నదృశ్యుఁడయ్యె హరి సర్వేశుండు విప్రోత్తమా! (1-285)
వ.అంత ననుకూల శుభ గ్రహోదయంబును, సర్వ గుణోత్తర ఫల సూచకంబునైన మంచి లగ్నంబునం భాడవ వంశోద్ధారకుండైన కుమారుండు జన్మించిన ధర్మ నందనుండు ధౌమ్యాది భూసురవర్గంబు రప్పించి, పుణ్యహంబు సదిమించి, జాతకర్మంబులు సేయించి, కుమారు జన్మమహోత్సవ కాలంబున భూసురులకు విభవాభిరామంబులైన గో భూ హిరణ్య హయానేక గ్రామంబులును స్వాదురుచి సంపన్నంబులై న యన్నంబులు నిడిన,వారలు ధర్మపుత్రునకిట్లనిరి.(1-286)
చ. ప్రకటిత దైవయోగమునఁ బొరవసంతతి యంతరింపఁగా
వికలత నొందనీక ప్రభవిష్ణుఁడు కృష్ణుఁడు డనుగ్రహించి శా
బకు బ్రతికించెఁ గావున నృపాలక బాలకుఁ డింక శాత్రవాం
తకుఁ డగు విష్ణురాతుఁ డన ధాత్రిఁ బ్రసిద్ధికి నెక్కెఁ బూజ్యుడై. (1-287)
వ. అని భూదేవోత్తములకు నరదేవోత్తముం డిట్లనియె. (1-288)
శా. ఓ పుణ్యాత్మకులార!నా పలుకు మీ రూహింపుఁడా మ్రొక్కెదన్
మా పెద్దల్ చిరకీర్తులై సదయులై మన్నారు రాజర్షులై
యీ పిన్నాతఁడు వారిఁ బోలెడిఁ గదా! యెల్లప్పుడున్ మాధవ
శ్రీ పాదాంబుజ భక్తియుక్తుఁ డగుచున్ జీవించునే? చూడరే! (1-289)
వ. అనిన విని నరేంద్రా! భవదీయ పౌత్రుండు మనుపుత్రుండైన యిక్ష్వాకు చందంబునం బ్రజల రక్షించ. (శ్రీ రామచంద్రుని భంగి బ్రహ్మణ్యుండు సత్య ప్రతిజ్ఞుండు నగు)డేగె వెంటనంటిన బిట్టు భీతంబై వెనుకకు వచ్చిన కపోతంబుగాచిన శిబిచక్రవర్తిభంగి (శరణ్యుండును, వితరణఖనియు నగు). దుష్యంత సూనుండైన భరతు పగిది సోమాన్వయ జ్ఞాతివర్గంబులకు(యజ్వలకు)ననర్గళ కీర్తి విస్తరించుచు,ధనంజయ కార్తావీర్యుల కరణి ధనుర్ధరాగ్రేసరుండగు. కీలిపోలిక దుర్ధర్షుండగు. సముద్రుని తెఱంగున దుస్తరుండాగు.మృగేంద్రుని కైవడీ విక్రమశాలియగు. వసుమతిం బోలె నక్షయ క్షాంతి యుక్తుండగు. భానుని లాగు ప్రతాపవంతుండగు.వాసుదేవు వడువున సర్వభూతహితుండగు. తల్లిదండ్రులమాడ్కి సహిష్ణుఁడగు. మఱియును. (1-290)