పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

5

సంచరించి, అర్చిరాది గమనంబునం బరమపదంబునం బొందెడునాఁడు నాభినుండి ప్రణవభూరినినాదంబు చెలంగ నీతోడం గూడి నిన్ను సేవించుకొని, హృదయగుహనుండి వెడలి, వాగాదీంద్రియంబులను మనంబుతోఁ గూర్చి, మనంబుఁ బ్రాణంబులఁ దగిలించి, ప్రాణంబుల జీవునిం గలపి, జీవుండైన తన్నుఁ బంచతన్మాత్రల నంటించి, యాజీవప్రకృతి నీయందుం బాదుకొల్పి నీయాధారంబున సుషుమ్నానాడి భేదించి, మూర్ధన్యనాడియైన బ్రహ్మరంధ్రంబున సూర్యకిరణంబులతో నిర్గమించి యగ్న్యహ శ్శుక్లపక్షోదగయనాబ్దాభిమాని దేవత లనియెడి యాతివాహిక గణంబులొండొకరిచేతి కందీయఁగా వాయువుఁ బ్రవేశించి సూర్యమండలంబు సొచ్చి చంద్రమండలంబు సొచ్చి మెఱుంగైయున్న విద్యుత్పురుషుని సహాయంబున వరుణేంద్ర బ్రహ్మలోకంబులు గడచి సువర్ణబ్రహ్మాండ కటాహంబుభేదించి పృథివ్యప్‌తేజోవాయ్వాకాశాహంకార మహత్తు లనియెడి సప్తావరణంబులనుం దాఁటి మూలప్రకృతి మీఱి విరజానది యుత్తరించి తేజోరాశియైన బ్రహ్మంబనియెడు నీ స్వరూపంబుం బ్రవేశించునట. ఎటువంటి క్రొత్తైన కథ వింటిమి. అహహా ! శ్రీ వేంకటేశ్వరా!

10

మురహరా ! ఆర్తులకు నభయంకరుండవు. సంసార సర్పదష్టులఁదేల్ప గరుడధ్వజుండవు. అజ్ఞానతిమిరస్థులకు సూర్యనారాయణుండవు. పాపమను మొసలిచేతఁ బట్టువడిన వారి బాధలు మాన్పఁ జక్రాయుధుండవు. దారిద్య్రదావానలంబార్ప గంగాజనకుండవు. దేవతలపాలింటి కల్పవృక్షంబవైన యశ్వత్థనారాయణుండవు. యోగీశ్వరులపాలికి చింతామణివైన కౌస్తుభవక్షుండవు. భక్తజనపాలకలక్ష్మీనాథుండవు. నీ ప్రతాపం బేమని వర్ణింపవచ్చు? నీ కల్యాణగుణంబు లెన్నియని లెక్కపెట్టవచ్చు? నీ మహిమ లేమని తెలియవచ్చు? మేము మా నోరికొలందిఁ గొంత చింతించెదము. చిత్తగింపవే శ్రీ వేంకటేశ్వరా !