పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

శ్రీ వేంకటేశ్వర వచనములు


11

రుడధ్వజా! యేమని చె ప్పె డి ది నీ ప్రభావంబు ? నీ నాభికమలంబునం బుట్టెనట; విరించి మీ మహిమం దెలియ శక్తుండు గాఁడట! నానావేదంబుల నీ మహిమలు చెప్పునట; నీ మూర్తి కడగుఱుతుం గానవట! రవిచంద్రులు నీ నయనంబు లట; నీ యపారతేజోమహిమంబు లెఱుంగలేరట! ఇంద్రాది దేవతలు నీ యాజ్ఞాధారులట; యొక్కొక్కమాఱును నీతోఁ గినిసి నిన్నెదిరించలేక నీ శరణు వేఁడుకొందురట! పంచమహాభూతంబులు నీ ప్రకృతిగుణంబులట; నీ స్వభావంబు లట్టివి యని తెలుపఁజాలవట! సముద్రంబులు నీ పాన్పట; నీ గుణంబుల లోఁతెఱుంగవట! మునులు భవదీయస్వరూప సూచకవాదులట; నీ మాయ దాఁటనోపరట! చరాచరజగత్తు నీ సృష్టియట; నిన్నుం జూపి చెప్పనోపదట! నా శక్తి యెంత? నేనెంత ? నే నీశ్రీపాదంబులు గతియని యుండఁగా నీవే దయదలంచెదవుగాక! శ్రీ వేంకటేశ్వరా!

12

గోపికావల్లభా! నేఁ దలపోయంగా ఫలియించిన మేలు, మఱియు నే వెదకంగా దొరకెడు పదార్థంబులు, నేఁ గోరంగా వచ్చు లాభంబు, నేఁ జదువంగాఁ దెలిసినయర్థంబు, నే గడియించుకొనంగా సిద్ధించిన ధనంబు, నా నేర్పువలనఁ దెచ్చుకొనియెడి సుఖంబు, నా చేతులఁజేసిన పుణ్యంబు, నా తపోబలిమిం గైకొను లోకంబు, నా పురాకృతఫలంబు, నా మనోరథంబు, నీవే. నా నుదుట బ్రహ్మదేవుండు వ్రాసినవ్రాలు, నే జన్మించిన జన్మకారణము, నా యంతరంగంబులో నున్న మూర్తి, నీవే సుమీ! నా కలిమి విన్నవించితి. శ్రీ వేంకటేశ్వరా!

13

పీతాంబరధరా! నీసాలోక్యంబు నాకు నీ భూలోకంబుననే సిద్ధించియున్నది; సామీప్యంబు హృదయకమలంబున లభియించె;