పుట:Shriiranga-mahattvamu.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

తృతీయాశ్వాసము


తే.

యుష్మదుదయంబు లోకనేత్రోత్సవంబుఁ
జేయుచుండెడిఁ గల్యాణదాయి యగుచుఁ
దపము నీపొందుఁ జేసినదానఁ జంద్ర
పుష్కరిణి నాఁగ వెలయు నీపుణ్యసరసి.

153


ఆ.వె.

పురుషులందుఁ బుణ్యపురుషుండు-సతులలో
నబ్ధితనయ - నదులయందుఁ గంగ-
యెవ్విధమున వెలయు నవ్విధమునఁ దీర్థ
రాజి నీసరోవరంబు మెఱయు.

154


వ.

అనిన నప్పద్మలోచనునకు సుధారోచి యిట్లనియె-

155


చ.

జిగిఁ దళుకొత్తు క్రొత్త వికసించిన తెల్లని తమ్మిరేకులం
దెగడెడి కన్నులు న్నగవు దేరెడి చూపులు గుండలద్యుతి
స్థగీతములై మెఱుం గెసఁగు చక్కని చెక్కులుఁ బల్లవారుణం
బగునధరంబుఁ గల్గు భవదాస్యవిలాసము నిల్పు నామదిన్.

156


క.

ఆ చొప్పునను మదీయ వి
లోచనములు చూచుఁ గాక లోలత నెపుడున్
నీచారుమూర్తి ననవుఁడు
నాచంద్రునితోడ దనుజహరుఁ డిట్లనియెన్.

157


ఆ.వె.

అఖిలదోషరహితులై నిర్మలజ్ఞాన
వంతులైన యట్టివారి కైనఁ
గాని గోచరంబు గాదు నానిజమూర్తి
కూడ దట్టిపలుకు కుముదమిత్ర!

158


మ.

అనినం జంద్రుఁడు వల్కు, నట్లయిన నత్యల్పాల్పసత్కర్మటో
ధనులై ద్రిమ్మరు లోకు లెప్పగిది నార్తత్రాణధుర్యున్-రమా
సనపద్మార్యము ని న్నవార్యగతి సందర్శించి ధన్యాత్ములై
ఘనతం బొందుదు రట్టిపొందు వెలయంగా నిల్పు మిచ్చోటికిన్.

159