పుట:Shriiranga-mahattvamu.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

తృతీయాశ్వాసము


మధ్యప్రదేశంబునను వసింతురు, మొదలఁ దదీయప్రార్థనం బొనర్చి పిదప
నవగాహాదికృత్యంబు లాచరించునది, సర్వపర్వంబుల శర్వరీవిభుం డిందుఁ
గ్రుంకువెట్టుట నిందుపుష్కరిణీనామం బీ సరోవరంబునకు భువనప్రసిద్ధం
బుగా నయ్యె- నీవు సరసిఁ గృతస్నానుండవై- శ్రీరంగధామంబున కరిగి
యచట సుఖంబున నుండు, మిట్టి యుగ్రతపంబున లోకంబులు సముద్వి
గ్నంబులు సేయవలవ దీతీర్థవాసంబున నీతీరునం జేసి కృతార్థుండ
వయ్యెద వని చెప్ప యప్పద్మసంభవుం డరిగె- సనత్కుమారుండును
దదుక్తప్రకారంబునఁ బ్రవర్తించుచుండె.

58


ఉ.

ఏనరుఁ డీకథాపఠన మెప్పుడు సేయు నతండు పాపసం
తానము బాసి శాశ్వతపదంబు చనుం బితృదత్త మక్షయ
శ్రీనొనరించు నత్తఱి వసింప నృపాదులు సార్వభౌమతా
నూన ధనాఢ్యతాసుఖసమున్నతులన్ విలసింతు రెంతయున్.

59


క.

అని చెప్పి యప్పరాశర
తనయుఁడు వెండియును నాగదంతునితోడన్,
మునిముఖ్య, ముక్తికర మగు
వినుత పురావృత్త మొకటి విను మని పలికెన్.

60


చ.

ఒదవఁగ లోభయుక్తమతి నొక్కజఘన్యజుఁ డధ్వనీనులం
జదియఁగ మోది, వారిధనజాలముఁ జాలుపుగా హరించుచున్
జెదరక యివ్విధంబు నిజజీవికగా మనుచుండు నట్టి బ
ల్లిదుఁ డగువానిచే సమసె లెక్కకు మిక్కిలిగా ద్విజావళుల్.

61


క.

ఇటు బహుముఖముల మఱియా
కుటిలాత్ముఁడు తెరువుగొట్టికొని యొకనా డు
ద్భటభంగి నున్నతటి న
చ్చటగా భూదేవుఁ డొకఁడు చనుచున్ వానిన్.

62


మ.

కనియెం, గర్కశమేచకాంగు నతిరక్తక్రూరవిస్ఫారలో
చను, నుత్తీర్ణ కరాళ బర్బర కచశ్మశ్రున్, వినీలాంబరుం,