పుట:Shriiranga-mahattvamu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

ద్వితీయాశ్వాసము


వ.

అని నిజకులగురుం డగు నయ్యతివరుం డుపదేశించిన హర్షించి-యతని
కభివందనం బొనర్చి - వీడ్కొని యమ్మహీకాంతుండు - సకాంతుండై -
కాంతారంబున కరిగి యచట నిర్ద్వంద్వుండును వశిష్ఠాశ్రమసమీపంబునఁ
దనదేవి పరిచర్య లొనర్ప నిష్పరిగ్రహుండును - నిశ్చలుండునునై తపం
బొనర్చు నంత.

19


ఉ.

తాఘనమయ్యె నల్గడ నిదాఘము, దూరనిరస్తచైత్రిక
శ్లాఘము, మార్గగాభిమత చండమయూఖ నిరోధ విస్ఫుర
న్మేఘము, తోయదానపరిమృష్ట మహాఘము, శుష్య దంబుమా
ర్గౌఘము, సర్వజంతువపు రుద్గత భూరినిదాఘ ముర్వరన్.

20


సీ.

అతిమరుద్ధూత శాఖాన్యోన్యసంఘట్ట
నోద్ధాగ్ని దగ్ధదావోత్కరంబు
చండభాను ప్రభాసహ సముజ్జృంభణా
టోప ప్రభిన్న గండోపలంబు
మృగతృష్ణికా సమున్మిష దంబుధిస్ఫుర
దవిరతోదన్య నానాధ్వగంబు
తప్త తోయాశ యాంతర్లుర త్పారీన
కమర నక్ర గ్రాహ సముదయంబు


తే.

చిటపకోటర సంలీల విహగకులము
నగలతాకుంజ విభ్రాంత మృగచయంబు
శాదనిర్మగ్న భూదార సైరిభంబు
నగుచు మించె నిదాఘసమాగమంబు.

21


క.

ప్రాణికిఁ దను వొసఁగు జగ
త్ప్రాణ పయఃపాదపములు పటుఘర్మపరి
క్షీణములై కోరె జగ
త్ప్రాణపయఃపాదపాంతరంబులఁ దమకున్.

22


క.

మునికన్యార్పిత జలములఁ
తనుపగు తమపాదులందుఁ దరువులనీడల్
గనుపట్టి నిలిచె దినకర
ఘనతర పరితాపభీతిఁ గదలనికరణిన్.

23