పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

65

మరియు నాయుధశాల కావలివారి నేల చంపవలెను ? మల్ల యుద్ధమునం దాయుధములతో బని యేమి ! కావున నీ రెండును గల్పితకథలు.

ఇట్లు కంససభకు బోయిన శ్రీకృష్ణులవారు తనమీఁదికి వచ్చిన కువలయాపీడమను మదగజమును జంపిరి. చాణూర ముష్టికులను మల్లురను శ్రీకృష్ణబలరాములు మల్లయుద్ధమున జంపిరి. అటుమీఁద శ్రీకృష్ణమూర్తివారు కంసుని, బలరామస్వామివారు కంసునితమ్ములను వధించి, చెరలో నున్న తల్లి దండ్రులగు దేవకీవసుదేవులను నుగ్రసేనుని విడిపించి యతనికి బట్టముఁ గట్టిరి.

అచటనుండి బలరామకృష్ణులు కాశీపట్టణమున కేగి యచట సాందీపునియొద్ద విద్యల నభ్యసించి మధురానగరము జేరిరి. కొంతకాల మచట నుండఁగా గంసుని మామయగు జరాసంధుఁడు మధురాపురిని ముట్టడించి శ్రీరామకృష్ణులతోఁ బోరాడి యందు బలరామునిచే బట్టువడి శ్రీకృష్ణులవారిపనుపున విడువఁబడెను. అటుపిమ్మట నాజరాసంధుఁ డనేకపర్యాయములు మధురానగరమును ముట్టడించుటయు, శ్రీకృష్ణాదు లాపట్టణమును విడిచి ద్వారకకు బోవుటయు సంభవించెను. జరాసంధునిబాధల కోర్వక తరువాత శ్రీబలరామకృష్ణులు మధురను విడిచి ద్వారకానగరమును స్వస్థానముగ జేసికొనిరి.