పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

157

     రవిచంద్ర దిగ్వాయు రాత్రిసంధ్యాదిన
          భూనభంబులు సర్వభూతములును
     సకలదిక్పాలకులు సాదు సచ్చరితము
          సర్వము నెఱింగి యుండుట సత్యమేని
     సవనహేతువు లోకైకసాక్షి యైన
          చిత్రభానుండు నన్ను రక్షించుఁగాక."

అని యిట్లుపల్కి యగ్నిప్రవేశముకాగా నామె పాతివ్రత్యమును బ్రహ్మరుద్రాదిదేవతలు మెచ్చునట్లగ్ని యామెనుఁ దహింపక యుండెను. అపుడు శ్రీరాములవారు సంతుష్టులై సీతాదేవినిఁ బరిగ్రహించిరి. ఆపిదప విభీషణసుగ్రీవాది పరివారసహితులై పుష్పక మను విమానము నధిష్ఠించి కదలి కిష్కింధయొద్ద గొంతతడవాగి తారాది వానరస్త్రీల నెక్కించుకొనిపోవుచు మార్గమున భరద్వాజునిం జూడఁగోరి యాయన యాశ్రమమునొద్ద దిగి యతనిచేఁ బ్రార్థితులై యతని యాతిథ్యమును నాటిదినమున నంగీకరించిరి

ఆ మునియాశ్రమమున నాడుండుటచేత నొప్పుదలప్రకారము నందిగ్రామము నాడు చేరుటకు వీలు లేనందున దామొక దిన మాలస్యముగఁ జేరుటకు గారణమును దెలుపుటకు హనుమంతుని భరతునికడ కంపిరి. అటు లతఁడుపోయి శ్రీరామా గమనమునుజెప్పి భరతు నానందభరితునిఁ జేసెను.