పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

చెప్పినటులఁ దీసికొనినను నంతకాలమువరకు మాతలి బ్రహ్మాస్త్ర మేయు మని యేల చెప్పలేదు ? ఈగ్రంథమునందు గాయత్రీమంత్రమునందుగల యిరువదినాలుగక్షరములకు నక్షరమొక వేయిశ్లోకములతో నింపఁబడి యిరువదినాలుగువేలశ్లోకములు గలిగి యనేకేతరనిబంధనలు తక్కిన గ్రంథములకంటె నెక్కుడుగ గలిగినందున నిది యాగ్రంథములకంటె నవీనమని చెప్పఁదగి యున్నది. అయితే కావ్యములలో నాదికావ్య మని యొప్పవచ్చును. అందుచేతనే దీని నాది కావ్య మని వాడెదరు. తక్కినగ్రంథకర్తలతోఁ బాటుగ నీతఁడును నీగ్రంథమున కాధిక్యముకొరకును ననాదిగ్రంథ మనిపించుటకును జెప్పినవిషయములను మనము గమనింపవలసినదేకాని గ్రంధకర్తయందు దోష మేమియు లేదు. మరియు శ్లోకము చదువఁగానె యర్థ మిచ్చునటులఁ బహుమృదువుగాఁ జెప్పఁబడినది. ఈగ్రంథమునకు గావ్య మని పే రుండినను నితరకావ్యములతోఁ బాటుగ వ్యంగ్యార్ధమునె బోధపరుపక పురాణేతిహాసములతోఁబాటు సకలనీతులను బోధపరచుచు శ్రీభగవంతుని యవతారమగు శ్రీరాములవారికథను గలిగియున్నందున నీకావ్యము భాగవత విష్ణుపురాణములతోఁ బాటుగ నతిపవిత్రమైనదియుఁ బూజార్హమైనదియు నిత్యపారాయణకు ముఖ్యమైనదియు నై యున్నది.