పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

369

41వ అధ్యాయము.

అనిర్వాచ్యమగు ఆనందముతో తాండవించునుగదా! అప్పుడు స్వర్గమహదైశ్వర్యములును క్షుద్రములై తోచును." అని రావణుడు ప్రత్యుత్తరమిచ్చినాడు.

975. ఒక మాలవాడు మాంసముతోనిండిన తట్టలను యిరువైపులను కావడిలో పెట్టుకొని మోయుచు, శ్రీశంకరాచార్యులవారికెదురుపడెను. ఆయన అప్పుడే గంగాస్నానముచేసి మరలిపోవుచుండెను. ఆయన పవిత్రశరీరమునకు మాంసపుకావడి తాకుట తటస్థించినది. "ఛీ ఛీ! నీవు నన్ను తాకితివే!" అని శ్రీశంకరాచార్యులువారు క్రోధియై పలికిరి. ఆమాలవాడిటుల ప్రతిపలికెను:- "అయ్యా! నేను నిన్ను తాకలేదు; నీవునన్ను తాకలేదు. నీవుయదార్ధమున శరీరమా, లేక మనస్సా, లేక బుద్ధియాతర్కించి చెప్పుము. నీవుఎవ్వరవో యదార్దము వచింపుము. ఈవిశ్వముగాకూడిన త్రిగుణములలో దేనికిని, సత్వమునకుగాని, రజస్సునకుగాని, తమస్సునకు గాని, యదార్థముగ నీఆత్మ అంటియుండజాలదని నీకు తెలియునుగదా!"

అంతట శ్రీ శంకరాచార్యులు లజ్జావహితుడై సత్య ప్రబోధమును గాంచినాడు.

976. ఒక తండ్రికి ఇద్దఱు కొడుకులుండిరి. సరియైన వయస్సురాగానే వారిని బ్రహ్మచర్యాశ్రమమును స్వీకరింపజేసి, వేదాధ్యయనము కొఱకై ఒక గురువునొద్ద ప్రవేశపెట్టినాడు.