పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

298

నేను నిన్ను చూడగోరుచున్నాను." అని బ్రతిమాలవలసివచ్చును. ఇదేరీతిని నీవు భగవంతుని ప్రార్థించవలయును. "ఓదేవా! నీజ్ఞానజ్యోతిని నీపైకి త్రిప్పుకొనుము. నేను నిన్ను చూడ వాంఛించుచున్నాను." అని మనవిచేయవలయును.

858. ఇంటిలో దీపములేకపోవుట యింటివారి దారిద్ర్యమునకుగుర్తు. కాబట్టి నరుడు తన హృదయమునందు జ్ఞానదీపమును వెలిగించుకొనవలయును. "ఓమనసా! జ్ఞానదీపమును వెలిగించి" బ్రహ్మమాయిని, "కనుగొనవే!"

859. బూటకము సర్వత్రచెడుగే. అసత్యపువేషముకూడ చెడ్డదే. నీమనస్సు నీవేషమునకు తగినటుల యుండనియడల నీవుగొప్ప ఆపదలపాలగుదువు. ఈరీతిగనే నరుడు మోసగాడై దొంగపనులు చేయుటకును, అబద్ధములు పలుకుటకును జంకులేనివాడగును.

860. ఒకభక్తునిప్రశ్న:- దివ్యమాతకు "యోగమాయ" అను పేరేల వచ్చినది?

శ్రీపరమహంసులవారి ఉత్తరువు:- యోగమాయ అనగా ప్రకృతిపురుషుల సంయోగము. నీవుచూచునదెల్ల వాని రెంటిసంయోగము తప్ప యితరమేమియుకాదు. శివ కాళీవిగ్రహమును చూడలేదా? కాళి శివునిపై నిలిచియుండును. శివుడు శవమువలె పడియుండును; కాళి శివునిపై నిశ్చలముగ దృష్టినిలిపి వానిపైని నిలిచియుండును; ప్రకృతి పురుషుల సంయోగమే దీనికంతకును అర్థము. పురుషుడు అకర్త; కావున శివుడు శవమువలె కదలక పడియుండును.