పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

234

తేనెటీగ సదా విచ్చినపూలపైననే నిలుచునుగాని అశుద్ధవస్తువులకై పోదు. లౌకిక పురుషులు ఈగలవలె అప్పుడప్పుడు భగవద్భక్తియను మిఠాయిని రుచిచూతురు, కాని వారి అపవిత్ర సంస్కారములు సహజముగా వారిని క్షుద్రవాంఛలవైపునకే లాగుచుండును. మహాత్ములగు పరమహంసలో, సదా భగవత్కృపనుగూర్చి ధ్యానముచేయుచు ఆనందపరవశులై యుందురు.

657. పూర్తిగ సంసారబంధమున జిక్కిన నరుడు అశుద్ధమునపుట్టి అశుద్ధమునచచ్చు పురుగువంటివాడు; వానికి ఇతర మేమియు తెలియదు. సామాన్యసంసారి ఒకప్పుడు అశుద్ధము మీదను, ఒకప్పుడు మిఠాయిమీదను వ్రాలుచుండు ఈగను బోలువాడు. ముక్తాత్ముడో సర్వదా పూదేనియనేత్రాగుచు, ఇతరమును చవిగొనని భ్రమరము వంటివాడు.

658. లౌకికపురుషుని హృదయము పేడకుప్పలోని పురుగువంటిది. అది నిత్యముపేడలోనె కాలముగడుపుచు, అక్కడనేయుండగోరును. కర్మముచాలక ఎవరైనను దానిని ఆ మలిన స్థలమునుండితీసి తామర పువ్వునందుంచినను, ఆపువ్వుయొక్క కమ్మనివాసనను భరించలేక చచ్చిపోవును. అటులనే లౌకికజనుడు తమ లౌకికవ్యవహారములను చింతలను వాంఛలను విడిచి ఒక్కనిమిషమైనను బ్రతుకజాలడు.

659. కాల్చనికుండ పగిలినయెడల, కుమ్మరి దాని మట్టిని ఉపయోగించి వేఱొక కుండను చేయగలడు. కాని కాల్చిన కుండ పగిలెనా వాడటుల చేయజాలడుగదా! అదేవిధమున