పుట:ShivaTandavam.djvu/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సూచించినారు. కానీ కొన్ని విషయాల్లో ఎందుకో నేను చాలా ఉదాసీనం. ఆ పని ఎప్పుడూ చేయలేదు.

అంతమాత్రమేకాదు. ఈ కాలంలో ఒక పుస్తకం వ్రాయడం ఒక నేరం చేసినంత పని. రాస్తే, ప్రింటుకావడం ఒక కష్టం. ఎవ్వడో పబ్లిషరు వేటగానివలె కాచుకొనివుంటాడు. ఇక మనమే అమ్ముకోవాలంటే హత్య నేరం చేసినవాడు తప్పించుకోవడానికి చేసేంత ప్రయత్నం చేయాలి. ఈ బాధలు ప్రతీ రచయితా అనుభవిస్తున్నవే.

నేను సుమారు నూటికి పైగా గ్రంథాలు వ్రాసినాను. గద్యమూ, పద్యము రెండూ వున్నాయి. మరి యెందుకో నా పేరూ శివతాండవ గ్రంథమూ పెనవేసుకొని పోయినవి. ఇదికూడా ఒక భగవత్ చిత్రమే. ఈ గ్రంథం ఇతర భాషల్లోకూడా పరివర్తితమయింది. జర్మన్ లోకి ఎవ్వరో చేసినారు. హిందీలోకి ఇద్దరు ముగ్గురు పరివర్తించినారు. నేను వానిని చూచినానుకూడా. ఇటువంటి గ్రంథాలు పరివర్తించడం చాలా కష్టం. ఇటువంటి కార్యాల గౌరవం ముఖ్యంగా శబ్దంపైన ఆధార పడుతుంది. ఇంగ్లీషులోకి తెద్దామని నేనే ఎన్నోసార్లు ప్రయత్నించినాను. కానీ ఆ భాషాంతరీకరణం ఎప్పుడు నాకు తృప్తినిచ్చింది లేదు. కాళిదాసు ఎన్నో గ్రంథాలు వ్రాసినాడు. ఆయన మేఘసందేశానికెందుకో గొప్ప అదృష్టం పట్టింది. విశ్వనాధవారు ఎక్కడ పోయినా కిన్నెరసాని పాటల్నే చదవమనేవారు.

శ్రీ బాపుగారు ప్రసిద్ధ చిత్రకారులు. వారికెన్నో పనులు. బహుకార్యవిష్టులైన్నీ నాపై దయతో చిత్రాలని గీచి యిచ్చినారు. వారికి నా మనఃపూర్వకమైన కృతాంజలి. ఇంకొకసారి శ్రీ ధన్ గారికి, తక్కిన మిత్రులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

పుట్టపర్తి నారాయణాచార్య

నవంబర్
1985