Jump to content

పుట:ShivaTandavam.djvu/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొలిపలుకు

ఇప్పటికి శివతాండవం పదిసార్లైనా ప్రింటు అయివుంటుంది. కానీ నేను ఆర్ధికంగా లాభపడింది మాత్రం చాలా తక్కువ. కారణాలు అనేకాలు. ముఖ్యంగా ఈ రాయలసీమ చీకటి ఖండం ఈ ప్రాంతాల్లోనే గడ్డకువచ్చి ఒక పేరు, ప్రతిష్ట సంపాదించుకోవలంటే చాలా కష్టం. సాహిత్యకంగా నా జీవితంలో ఎన్నో కల్లోలాలు ఎదుర్కోవలసివచ్చింది. ఒకసారి గుంటూరికి సాహిత్య మిత్రులు కొందరు నన్నాహ్వానించినారు. నాకు శరీర ఆరోగ్యము కూడా సరిగాలేదు అప్పుడు. ప్రయాణినికి కావలసిన జాగ్రత్తలన్నీ వారే చూచుకున్నారు. రామాయణం పైన నా ఉపన్యాసం. ఒక వేయిన్నూట పదహార్లిచ్చి సత్కరించినారు. ఆ సందర్భంలో శ్రీ ధన్ గారు నాకు పరిచయమైనారు. ఆయన సాహితీ ప్రేమికుడు. జీవితంలో కష్టసుఖముల నెరిగినవాడు. నన్నుగూర్చి వారికంతకు ముందే తెలుసు. వారు కొన్నివేలు ఖర్చుపెట్టి మంచి బొమ్మలతోపాటు శివతాండవాన్ని మరలా ముద్రించి యిస్తానని పూనుకొన్నారు. వారి యౌదార్యాన్ని నేనెట్లు గౌరవించవలెనో నాకు తెలియదు. చిరంజీవి రామమోహనరాయ్, మరికొందరు వారి ప్రయత్నానికి హర్షించి వారికి తోడైనారు. వీరందరికిన్నీగూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెల్పుకోవడం తప్ప మరేమీ చేయలేను.

శ్రీశ్రీగారి ' మహాప్రస్థానం ' లాగా ' శివతాండవా ' న్ని ముద్రించి పెద్ద వెలపెట్టి నా కార్ధికంగా యేదైనా ఉపయోగపడేటట్టు చూడాలని శ్రీ ధన్ గారు సంకల్పించారు. ఋణానుబంధాలు మహా విచిత్రంగా వుంటాయి. భౌతికాలైనా కారణాలతో వాని స్వరూప నిర్ణయాన్ని చేయడం నా యోగ్యతకు మించినపని.

నా పుస్తకాలలో నాకు ఎక్కువ ఖ్యాతి తెచ్చింది శివతాండవమేనని చెప్పవచ్చు. అనేక సంవత్సరాలుగా, అనేక సభల్లో విన్పించడం జరిగింది. విన్పించిన చోటంతా దాన్ని గూర్చిన పొగడ్తలేతప్ప, మరేమీ వినలేదు. ఇతర భాషలవారు కూడా తెనుగురానివారు కూడా దీన్ని విని ఎంతో మెచ్చుకొనేవారు. తిరువాన్కూరులో వున్నప్పుడు ఢిల్లీలో వున్నప్పుడు కూడా దీన్నిగూర్చిన పొగడ్తలే. ఆ కావ్యంలో అనుభూతంగావచ్చే 'లయ' వాళ్ళ నంతగా ఆకర్షించి వుంటుందను కున్నాను. దీనిని వ్రాసేటప్పుడు ప్రొద్దుటూరులో అగస్త్యేశ్వర స్వామికి చాలా నియమంగా ప్రదక్షిణాలు చేసేవాడిని. రోజూ 108 ప్రదక్షిణాలు. కోవెల చాలా పెద్దది. అప్పుడు వ్రాసినదీ కావ్యం. కావ్యం చాలా చిన్నగా వుందని, కొద్దిగా పెంచుదామని ఎంతెంతో ప్రయత్నించినాను. కానీ నాకు సాధ్యం కాలేదు. భగవదిచ్చ యింతేనేమో అనుకున్నాను.

ఈ కావ్యంలో సంగీత, నాట్య సాహిత్య సంకేతాలు పెనవేసుకొనివున్నాయి. ఆ మూడింటి యొక్క సాంప్రదాయాలు కొంతకుకొంత తెలిస్తేగానీ, ఈ కావ్యం అర్థంగాదు. దీనిపైన చిన్న వ్యాఖ్యానం వ్రాస్తే బాగుంటుందని చాలామంది నాకు