పుట:Shathaka-Kavula-Charitramu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xxxix)


గారశతకములు ప్రాయికముగా సీసపద్యములతో నున్నవి. వేణుగోపాలశతకమువంటి 'హాస్యశతకములు నిట్లేయున్నవి. చంద్రశేఖర శతకమువంటి యచ్చతెలుఁగు పామరభాషమాత్రము వృత్తములలో నున్నది. భాషాంతరీకరణము లగుశతకములు వివిధవృత్తములతో నున్నవి. ఇందుఁ దెలిగించిన కవికి స్వాతంత్ర్యము తక్కువ. అందువలన నివి చంపుపులవలె వివిధవృత్త సమన్వితములు కావలసివచ్చినవి. ఈచర్చపై నాయభిప్రాయములు తెలియఁగోరువారు నావాఙ్మయ చరిత్రమును జూడుఁడు. భాషాంతరముచేయుకవికి భావములపైస్వాతంత్ర్యము లేదు. కావుననే మకుటము నేనుఁగు లక్ష్మణకవి భర్తృహరి తెలిఁగింపులో మానుకొనెను. తెలుఁగుసంప్రదాయాను సారము కృతిభర్త నామము ప్రతిపద్యము చివరను జేర్చిన బాలసరస్వతి మల్లభూపాలీయ మనుభర్తృహరి తెలిఁగింపులో మకుటమును జేర్చ మూలముకంటె భిన్నముగను, కొన్నిచోట్లఁ గ్లిష్టముగను, వ్రాసి పాట్లుపడవలసివచ్చినది. చిన్నశ్లోకమును మకుటమునకై పెద్దపద్యముగా వ్రాయ వలసిన యీతఁడు మూలానుసార మెట్లు వ్రాయగలఁడు? ఈనడుమ నొకకవి సీసపద్యములో గీతము తీసివేసినట్లు, త్రిపాదులు ద్విపాదులు వృత్తములు వ్రాసియుండవలసి వచ్చియుండెడిది.

శతకస్వభావము గలమేఘసందేశము వంటికావ్యములు మందాంక్రాంతము మొదలగు సమజాతివృత్తములు వ్రాసియుండిరి. ఇచ్చట శతకస్వభావ మనఁగా "లిరిక్కని” నాయభిప్రాయము. మేఘసందేశమునందు శృంగారము ప్రధానము. తనకోర్కె తీరుటకు సంక్షుభితమనస్కుఁడైన యక్షుఁడు రక్షించు నని తాను తలంచుకొను మేఘు నుద్దేశించి పలుకుచున్నాఁడు. మనభక్తిప్రతిపాదకశతకముల యందు భక్తుఁడు ఘోరసంసారజలధిలో బంధింపఁబడి, సంక్షుభితమనస్కుఁడై రక్షకుఁ డని యాతఁడు తలంచుకొనుభగవంతునియిష్టావ తారమును, సాకారముగసంభోధించి తనయావేదనము వెల్లడించుకొని మోక్షమును గోరుచున్నాఁడు. ఈరెంటియందును గామపరితృప్తి ప్రధానము. తానురక్షింపఁపడుట, లేదా తనకోరికతీరుట ప్రధానము.