పుట:Shathaka-Kavula-Charitramu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7


కావ్యాదులను రచియించిరనుట యనుభవమునకు విరుద్ధముగ నున్నది. ధూర్జటి ధనార్థియై శ్రీ కాళహస్తీమాహాత్మ్యమును, మోక్షార్థియై శ్రీ కాళహస్తీశ్వర శతకమును రచియించిన విధమును గ్రంథములే తెలుపుచున్నవి. శతకముల రచనావిభాగములును నీయర్థమును బరిస్ఫుటము చేయుచున్నవి. నారాయణశతకమునందుగల శతకవిభాగము శతకప్రయోజనమును దెలుపుచున్నది.

“రమణీయంబుగ నాదిమంబు నవతారమ్ము౯ భవదివ్యరూ
 పము నామామృతము౯ దలంప దశకప్రాప్తయ్యె కృష్ణావతా
 రము సుజ్ఞానము మోక్షము౯ ద్వివిధసంప్రాప్తి౯ శతాంధ్రాఖ్య కా
 వ్యము నర్పించితి మీ పదాబ్జములకు౯ వైకుంఠ నారాయణా!

నారాయణశతకము ప. 101) శతకకవులచరిత్ర 92 వ పేజి.)

శతకము 1. ఆదిదశకము 2. అవతారదశకము 3. దివ్యరూపదశకము 4. నామదశకము 5. కృష్ణావతారదశకము 6. జ్ఞానవింశతి 7. మోక్షవింశతి యని ఏడుభాగములుగను విభజింపబడినది. శతకము భగవదవతారవర్ణనములతో నారంభమై మోక్షాపేక్షతో నంతమునొందుచున్నది. శతకములందు గామసూత్రాత్మకమైన కథలు వర్ణనాదులు లేకపోయినను భాగవతాత్మకమైన కథలు వర్ణనలు గలవు. భాగవతపరములైన పద్యములందుగల పరమేశ్వర లీలా విలాసములవర్ణనలు భావగీతభావవర్ణనముల కతీతమై వ్యక్తిత్వమును భక్తిరసావేశమును గలుగజేయుచున్నవి. భావగీతములు భౌతికానందమును, శతకము లాధ్యాత్మికానందమును గలుగజేయుచున్నవి. ప్రాచ్యసంస్కారపరములైన శతకములకును పాశ్చాత్యసంస్కారపరములైన భావగీతములకును సామ్యత్వము దుర్లభము. భక్తిజ్ఞాన వైరాగ్యబోధకములైన శతకము లాంధ్రభాషాభూషణములై పండితపామరజనులకును బాలబాలికలకును బఠనార్హములుగ నున్నవి.