పుట:Shabda-Lakshana-Sangrahamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6



రచింప సకల్పించి సూత్రాంధ్రవ్యాకరణము నారంభించి కొంతవఱకు సాగించియుండును. ప్రాచీనాంధ్ర వ్యాకరణములు చింతామణి వికృతివివేకములు సంస్కృతములో నుండటయే యాతని సంస్కృతసూత్రరచనకుఁ బ్రేరకమైయుండనోపును. కాని రచన కొంతదనుక సాగునప్పటికి, తెనుఁగు వ్యాకరణము సంస్కృతములో నుండి పెక్కుమందికి దుర్బోధమగుటకంటె నా సూత్రములు మాతృభాషలోనే విరచితములగుట యుచితమనితోఁచి వానినే యలఁతి యలఁతి మార్పులతోఁ దెనుఁగు సూత్రముల రూపమున ననువదింప నారంభించెను. అదియే యాంధ్రశబ్దాను శాసనము. ఇది రచించు సమయమున చూడామణి, సర్వలక్షణ సారసంగ్రహము, కవిసంశయవిచ్చేదము మున్నగువానివలెఁ దెనుఁగు లక్షణము ఛందోబద్దమై పద్వరూపమున నుండుట బాలురకు ధారణయోగ్యముగా నుండునేమోయని యెంచి యాసూత్రములనే పద్యములలో రచింప మొదలిడెను. ఇదియే వద్యాంధ్ర వ్యాకరణము. ఈ రచన కొంతవఱకు సాగునప్పటికి నే లక్షణ గ్రంథమైనను అన్యూనానతిప్రసక్తములగు సూత్రముల రూపమున నుండుట యుచితముగాని ఛందోనియమముచే ననివార్యములగు ననావశ్యకపదముల మేళనముతోఁ బద్య రూపమున నుండుట సరికాదని యాతనికిఁ దోఁచియుండును.

అదియుఁగాక యాతనిదృష్టి యింతవఱకు సష్టాధ్యాయీ పద్ధతి సనుసరించి యుండుటచే సంస్కృత సూత్రములుగాని తెనుఁగు సూత్రములుగాని పూర్వోత్తర సూత్రానపేక్షముగఁ బరిపూర్ణార్థావ బోధకములు గాకుండుట గోచరించి యుండును.