విజ్ఞప్తి
1921 - 22 సంవత్సరముల ప్రాంతమున నాంధ్ర పత్రికలో చక్కని శైలితో రమణీయములగు భావములతో వసంతలేఖలు, పచురింపబడుచుండెడివి. వానిని చదువుచుండ నిదేమాదిరిగా స్త్రీలకు సంబంధించిన విషయములను గూర్చి లేఖలు వ్రాయవలయునని నాకుగూడ కుతూహలము గలిగెను. వెంటనే యొక లేఖనువ్రాసి శ్రీమతి కళ్లేపల్లి వెంకటరమణమ్మగారి యాధిపత్యమున వెలువడిన 'ఆంధ్రలక్ష్మి ' యను స్త్రీమాసపత్రికకు బంపితిని. ఆ పత్రిక నడచినంతకాలము నా శారదలేఖలు గూడ నందు క్రమముదప్పక ప్రచురింపబడు చుండెను. అది ఆగిపోవుటతో నా లేఖలును ఆగిపోయెను. తదుపరి శ్రీమతి వింజమూరి వెంకటరత్నమ్మగారి 'అనసూయ' పత్రిక పునరుద్ధరింపబడగా వారి కోర్కెపైని యందును రెండు మూడు లేఖలు వ్రాసితిని. తరువాత నదియు నాగిపోయెను.
తదుపరి 1928 వ సంవత్సరమునందు 'గృహలక్ష్మి' ప్రకటింపబడ నున్నపుడు ప్రతికాధిపతులు నా వ్యాసములను కోరగా 'శారదలేఖ'లను వ్రాసెదనని తెల్పి యటులనే వ్రాసి పంపితిని. నాటినుండి నేటివఱకు నా లేఖలను నడపుభారము 'గృహలక్ష్మి'యే వహించియున్నది.
దేవతావల్లరియైన కల్పలతవలెనే నా లేఖలును చిరకాలము వర్ధిల్లవలయునను తలంపుతోడను, కల్పలతవలెనే నాలేఖలును స్త్రీలయ భీష్టప్రదాయినులుగా నుండవలయునను తలంపుతోడను, నాలతకు నెల్లప్పుడు పూచినపూవులుగా నాలేఖలు