Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

ప్రచురింపబడుచుండెడి తలంపుతోడను, నేను జాబులువ్రాసెడి కల్పిత వ్యక్తియైన నెచ్చెలికి కల్పలతయని యభిధేయమిడితిని. రచనాసౌకర్యముకొఱకు కొలదిమార్పులు చేయబడినను, వ్యక్తులయొక్కయు, ప్రదేశములయొక్కయు పేరులు మార్చబడినను నిందలి విషయములు మాత్రము యథార్థములని నేను రూఢిగా చెప్పగలను. కన్నులార చూడనివియు, చెవులార విననివియు, చక్కగా మనస్సునకు నవగాహనము చేసికొననివియు నగు విషయము లేవియు నిందు లిఖింపబడలేదు. కాన ప్రస్తుతము 'శారదలేఖ’ల ప్రచురణము వినోదతుల్యముగా భావింపబడి వాని ప్రయోజనము గుర్తింపబడకున్నను మును ముందు నిప్పటి దేశవ్యవహారములను సాంఘికపరిస్థితులను దెలిసికొనుటకు చారిత్రకముగ దోడ్పడి ప్రయోజనకరముగా నుండగలవని నా యాశయము.

'గృహలక్ష్మీ' పత్రికను స్థాపించి యాంధ్రమహిళా ప్రపంచమునకు జేయుచున్న యపారయుపకృతియే గాక మహౌదార్యముతో నా లేఖా సంపుటములను గూడ ప్రచురింపబూనిన మ, రా, శ్రీ డాక్టరు కే. యన్. కేసరిగారికి నా మనఃపూర్వక నమస్కారము లర్పించుచున్నాను. పత్రికలలో ప్రచురింపబడిన నా శారదలేఖలపై జూపిన యాదరమునే యీ లేఖాసంపుటములపైగూడ జూపి యాంధ్రమహాజనులు ప్రోత్సహింపగలరని నమ్ముచున్నాను. భగవంతు డనుగ్రహించునుగాక !


బాపట్ల

ఇట్లు సుజనవిధేయి,

31 - 1 - 1934

కనుపర్తి వరలక్ష్మమ్మ.