Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/858

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఛాయాసోమనాథాలయము

సంగ్రహ ఆంధ్ర

ఈ మూడు ఆలయములలోను, తూర్పు ప్రక్కన గల ఆలయము సూర్యదేవుని ఆలయ మని పిలువబడుచున్నది. ఈ ఆలయమునకు చెందిన గర్భాలయము నందలి పానవట్టము మీద అనూరుని యొక్కయు, ఏడశ్వముల యొక్కయు విగ్రహములు చెక్కబడి యున్నవి. పశ్చిమమున నున్న ఆలయము పేరు సోమేశ్వరాలయము. ఈ ఆలయములోని లింగము మీద, దాని పొడవునా లేనీడ కాన్పించును. ఈ లేనీడ ఉదయమునుండి సాయంత్రము వరకును, ఉత్తర దక్షిణ అయనములలోను మారక, అదే స్థానములో నుండును. ఈ ఛాయను బట్టియే అభినవ సోమనాథునికి 'ఛాయా సోమేశ్వరుడు' అన్న పేరు గల్గినది. ఈ నీడను గూర్చిన రహస్య విషయ మిది : ఈ గర్భాలయ ద్వారము కడ నిలబడి మండపములోనికి చూచినచో, ఎదురుగా సూర్యదేవర ఆలయమును, దాని కిరుప్రక్కల మండపపు అంచుననే నిర్మింపబడిన లో అరుగును, ఆ అరుగు యొక్క అంచుల సరసగా నిలబెట్ట బడిన రాతి దిమ్మలును, వాటి అంచులును కానవచ్చును. ఈ అంచులు సూర్యదేవర ఆలయ ప్రవేశమునకు ఒకటి దక్షిణమునను, మరియొకటి ఉత్తరమునను కనబడును. ఈ అంచునకును, మండపము యొక్క చూరునకును నడుమగా ఆకాశము కాన్పించును. సోమనాథాలయము యొక్క గర్భాలయము లోనికి ఈ కాళీ ప్రదేశముల ద్వారా వెలుతురు ప్రసరించును. ఈ కాంతి పుంజము గర్భాలయమును దాటి లింగమునకు గల రెండు నిలువు టంచులను మాత్రమే స్పృశించుచు గర్భాలయముయొక్క గోడ మీద పడును. ఈ రీతిగా నడిమి భాగము కంటె అంచులు ప్రకాశవంతముగా నుండును. అందుచే మధ్య భాగములో 'నీడ' పడినట్లు కానవచ్చును. ఈ 'నీడ', సూర్యుని వెలుతురుపై కాక, ఆకాశపు వెలుతురుపై ఆధార పడును గనుక, దానిచోటు మారదు. గర్భాలయ ద్వారము యొక్క నిలువు కమ్మీల పైన చేతిని పైకి జరుపుచు చూచిన యెడల, నీడయొక్క అంచుపై చేతి జాడ పైపైకి జరుగుచున్నట్లు కాన్పించును.

మూడవ ఆలయము ఏ దేవరదో తెలియుట లేదు. ఈ ఆలయములో చెదరిపడియున్న దేవ దేవర, బ్రహ్మ, విఘ్నేశ్వర విగ్రహములు తెచ్చియుంచినవే గాని స్వతస్సిద్ధముగా ఈ ఆలయము లోనివి కావు. ఇచ్చటి నంది కొన్ని అంశములలో రామప్పదేవాలయపు నందిని పోలియున్నది. పీఠమునకు నలుమూలల మైలారు వీర భటులు నృత్యము చేయుచున్న ట్లున్నారు. ఇదియు తరువాతి కాలము నాటిదే. సోమేశ్వరాలయ ద్వారపాలురు డమరుక, బాణ, గద, అభయహస్తులు. హనుమకొండ రుద్రేశ్వరాలయమునకు వలెనే దీనికిని ప్రవేశము దక్షిణము నుండియే కలదు. ప్రాకారము, దక్షిణపు ప్రక్క ప్రాకారములో ప్రవేశ మండపము ఉన్నట్లు చిహ్నములు గలవు. ప్రధానాలయమునకును, ప్రాకారమునకును నడుమ పశ్చిమమున మూడును, దక్షిణమున ఒకటియు, తూర్పున రెండును శిఖరములులేని రెండు చిన్న ఆలయములు కలవు. ఆలయమునకు తూర్పున పుష్కరిణియు, దాని యొడ్డున నాలుగు స్తంభముల మండపమునుగలవు.

ఈ మండపశిఖరమును, ఆలయశిఖరములు మూడును 'మెట్లశిఖరములే' యనబడుచున్నవి. మెట్లకు కొంచెముగా అలంకారము కూడ కలదు. శుకనాసికి ఇది శిఖరమా అనునట్లు, శిఖరముయొక్క ముందువైపున మూడు శిఖరములకును అర్ధశిఖరము గలదు. పానుగల్లు, వర్ధమాన నగరము, బహుశః అలంపురపు పాపనాశన క్షేత్రములలోని ఈ మెట్ల శిఖరాలయములు కందూరు చోడులచే నిర్మితములైనవే.

పానుగల్లులో జైన విగ్రహము లెవ్వియును కానరావు. అయితే బయటినుండి తెచ్చి నిలిపిన శిల్పము తప్ప అభినవ సోమనాధాలయములో శైవ శిల్పము కానరాదు. ఇది తొలుత జైనాలయమై యుండి యుండు ననుటకు అవకాశము కలదు.

శ్రీ. గో


★★★★★

790