Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/840

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఛత్రపతి శివాజీ మహారాజు

సంగ్రహ ఆంధ్ర

వర్తిచే పరాజితులైరి. పిదప బహమనీ సుల్తానులకు లోబడి వారిరాజ్యము చీలికలైన తర్వాత కొంతభాగము అహమద్‌నగర సుల్తానులకును, కొంత ప్రాంతము బీజాపూర సుల్తానులకును దక్కెను. పదునేడవ శతాబ్దారంభమున సమర్థ రామదాసు, తుకారాము మున్నగు మహాభక్తులు ధర్మ ప్రబోధకులుగా నుండిరి. వీరు మహారాష్ట్రులలో స్వమతాభిమానమును, సామాజిక దృక్పథమును పొటమరింపజేసిరి. బీజాపూర్, అహమ్మద్‌నగర రాజ్య ప్రాంతములలో మహారాష్ట్ర ప్రముఖులు కొందరు సైనికులుగను, ఉద్యోగులు గను ప్రవేశించి, రాజాశ్రయమును సంపాదించికొని జాగీర్దారులుగ ప్రబలు లగు చుండిరి. మొగలాయి చక్రవర్తుల రాజ్య విస్తరణ కాంక్షకు గురియై తమలో తాము కలహించుకొనుచు, దక్కను నందలి మహమ్మదీయ రాజ్యములు బలహీనము లగు చుండినవి. ఇట్టి రాజకీయ, సాంఘిక పరిస్థితులు మహారాష్ట్రుల విజృంభణమునకు కారణము లైనవి.

చిత్రము - 222

పటము - 1

మహారాష్ట్రులలో భోఁస్లే కుటుంబము ఈ సందర్భమున ప్రాముఖ్యమును గడించినది. ఈ వంశము వాడైన శహాజీ అనునాతడు అహమద్‌నగర నవాబుల కొలువున నుండి ఆ రాజ్యముపై దండెత్తి వచ్చిన మొగలు చక్రవర్తి షాజహాన్‌తో యుద్ధమునకు తలపడి, అహమద్‌నగర స్వాతంత్ర్యమును రక్షించుటకు ప్రయత్నించి విఫలు డయ్యెను. పిమ్మట బీజాపూర్ నవాబుల నాశ్రయించి, పూనాను జాగీరుగా సంపాదించెను. మహారాష్ట్రులను సంఘటిత పరచినచో వారు శౌర్యము నందును, క్రమశిక్షణ యందును మొగలులతో పోటీపడగల సామర్థ్యము కలవా రగుదురని తొలిసారిగా శహాజీకితోచినది. మొగలులను ఎదిరించిన మహారాష్ట్రులలో శహాజీ యే మొదటివాడు. ఈ శహాజీ కుమారుడే ఛత్రపతి శివాజీ మహారాజు.

బాల్యము నుండియు ధర్మయోధు లయిన రామాయణ, భారతవీరుల వీరోచిత కార్యకలాపములు, ధర్మోద్ధరణాభిలాష యెంట బట్టించుకొని పరమతోల్బణమును అరికట్ట సమకట్టిన శివాజీకిని, బీజాపూరు సుల్తానుల ప్రాభవమునకును తన మనుగడ ముడిబెట్టుకొన్న శహాజీకిని మార్గములు వేరయ్యెను.

పూనాకు సమీపమున శివనేరుగిరి దుర్గమున 10, ఏప్రియల్ 1627 లో శివాజీ జన్మించెను. శివనేరున నున్న శివాయిదేవి వరప్రసాదమున జన్మించిన వాడగుటచే తల్లి జిజియాబాయి తన కుమారునకు శివాజీ యని పేరు పెట్టెను. దాదోజీ కొండదేవ్ అను నొక బ్రాహ్మణుని సంరక్షకత్వమున తన భార్యయైన జిజియాబాయిని, కుమారుడైన శివాజీని నిల్పి శహాజీ బీజాపూరునందు నివసింప సాగెను. కొండదేవ్ శివాజీకి మల్ల యుద్ధము నందును, గుర్రపు

772