Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/822

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చైనాదేశము (చ)

సంగ్రహ ఆంధ్ర

గుర్తించిరి గాని చైనాలో తమకు గల హక్కులను త్యజింప నిరాకరించిరి. శాంతి, ప్రజాస్వామ్యములలో పాశ్చాత్యుల విశ్వాసమును చైనీయులు అనుమానింప సాగిరి.

కూమిన్‌టాంగ్ – సోవియట్ రష్యా సహకారము : సన్ యట్ సేన్ షాంఘైలో నున్న కాలమున సోవియట్ రష్యాతో సహాయ సంప్రదింపులు జరిపెను. 1917 లో లెనిన్ నాయకత్వమున రష్యాలో స్థాపితమైన సామ్యవాద ప్రభుత్వము సామ్రాజ్యవాదమును ఖండించి, పీడిత ప్రజలకు ఆశాజ్యోతి యైనది. అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీని స్థాపించి, ప్రపంచములోని సామ్రాజ్యవాద వ్యతిరేకులకును, శ్రామిక వర్గములకును సహాయము చేయ లెనిన్ నిశ్చయించెను. సోవియట్ ప్రతినిధియైన అబ్రహాం అడాల్ఫుజోఫి షాంఘైలో సన్ యట్ సేన్‌తో సంప్రదించి చైనాకు రష్యా సహాయమొనర్చునని వాగ్దాన మొనర్చెను. మే, 1920 లో, చన్ ట్యు హ్సి అను పీకింగ్ విశ్వవిద్యాలయాచార్యుని నాయకత్వమున, షాంఘైలో చైనా కమ్యూనిస్టుపార్టీ స్థాపింపబడినది. 1923 జూన్ లో జరిగిన మహాసభలో కమ్యూనిస్టులు సన్‌యట్ సేన్‌తో పొత్తు కలియుటకు నిర్ణయించిరి. సన్‌ యట్ సేను కూడ రష్యా సహాయముతో విదేశ సామ్రాజ్యవాదులను పారద్రోలి చైనాలో ఆర్థిక సమానత్వముపై ఋజువైన ప్రజాస్వామ్య ప్రభుత్వమును స్థాపించుటకు సంకల్పించెను.

చైనా సమైక్యమునకు ప్రయత్నము : సన్ యట్ సేను అనుచరులలో వాంగ్ చింగ్ వై, చియాంగ్ కేషేక్ అను వారు ముఖ్యులు. అందు, చియాంగ్ కేషేక్ 1923 లో సైన్యమును సమకూర్చుకొని, కాన్‌టన్‌లోని సైనిక ప్రభువును పారద్రోలెను. సన్ యట్ సేన్ తిరిగి కాన్ టన్ ప్రభుత్వమున కధ్యక్షు డయ్యెను. 1924 లో జరిగిన అఖిల చైనా కూమిన్ టాంగ్ మహాసభకు మావ్ సే టుంగ్ మున్నగు కమ్యూనిస్టు నాయకులు కూడ హాజరై సన్ యట్ సేన్‌తో సహకరింప సమ్మతించిరి. ఇదే సమయమున కాన్‌టన్ ప్రభుత్వమునకు సహాయ మొనర్చుటకై రష్యానుండి 70 మంది సేనానులతో మైకేల్ బొరోడిన్ పంపబడెను. చైనా విప్లవకారులను తర్ఫీదు చేయుటకై వాంపోవా సైనిక పాఠశాల స్థాపింపబడెను. మే, 1924 లో మంచూరియా, తూర్పు చైనాలలో, తన హక్కులను రష్యా త్యజించుటచేత, చైనీయులకు రష్యాపట్ల గౌరవ మినుమడించెను.

ఇట్టి పరిస్థితులలో పీకింగ్ లోని సైనిక ప్రభువుల మధ్య కలహము లారంభమైనవి. మంచూరియా నాయకుడైన చాంగ్ సోలిన్ పీకింగ్ నుండి వూ పైపును వెడలగొట్టి, ట్యాంచిజుయిని అధ్యక్షునిగా నొనర్చెను. ఈ ఉభయులు కలిసి, సన్ యట్ సేను నాహ్వానించి సమైక్య చైనాకు అధ్యక్షుడవు కమ్మని కోరిరి. ఈ ఆహ్వానము నంగీకరించి, సన్ పీకింగ్ చేరెను. కాని తన ఆశయము పూర్తిగాక పూర్వమే, 12-3-25 లో సన్ యట్ సేను మరణించెను. సన్ యట్ సేను చైనా జాతి పితగా భావింపబడుచున్నాడు. కాని, అతడు నిర్దుష్టమై ప్రగతి శీలమైన విధానమును రూపొందించి ఏకాగ్రతతో అవలంబింపలేక పోవుటచేతనే చైనా జాతీయోద్యమము అడ్డదిడ్డముగా నడచెను.

చియాంగ్ కేషేక్ నాయకత్వము : సన్ మరణముతో చైనా సమైక్యమునకు అవకాశములు సన్నగిల్లెను. ఉత్తరమున సైనిక ప్రభువులమధ్య కలహములు తిరిగి చెలరేగెను. పీకింగ్ లో చాంగ్ సోలిన్ అధ్యక్షుడైనాడు. కొన్నికొన్ని రాష్ట్రములలో వూపైపు, మరికొన్నింటిలో ఫెంగ్ సేనాని అధికారము వహించిరి.

కాన్‌టన్‌లోని కూమిన్ టాంగ్ ప్రభుత్వమునకు వాంగ్ చింగ్ వై అధ్యక్షుడయ్యెను. చియాంగ్ కేషేక్, లియోచంగ్ కే అనువారు ఆతని సలహాదారులైరి. రష్యా ప్రతినిధియైన బొరోడిన్ కూడ కాన్‌టన్ ప్రభుత్వమునకు తోడ్పడుచుండెను.

ఉత్తరదండయాత్ర : ఉత్తరరాష్ట్రములను జయించి చైనాను సమైక్యమొనర్చుటకై, కాంటన్ ప్రభుత్వము, చియాంగ్ కే షేకును సర్వసైన్యాధిపతిగా నియమించెను. జులై, 1926 లో ప్రారంభమైన ఈ దండయాత్రకు కమ్యూనిస్టులేగాక, ఉత్తరరాష్ట్రప్రజలు కూడ హృదయ పూర్వకముగ తోడ్పడిరి. మార్చి 1927 నాటికే వూహాన్, హూనన్, హ్యుపే, కియాంగ్సీ, ఫూకిన్, చిక్ యాంగ్ రాష్ట్రములు, నాన్‌కింగ్ నగరము, చియాంగ్ వశమైనవి. డిసెంబర్ 1927 లో కూమిన్‌టాంగ్ కార్యస్థానము హాంకోకు మార్చబడెను. హాంకోలోని తమ హక్కులను

754