Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/778

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెకోస్లావేకియాదేశము (చ)

సంగ్రహ ఆంధ్ర

బంధువో రెండు గుప్పెళ్ళ మన్ను తీసికొని ఆ సమాధిపై చల్లుచు, “నీకు నాకు దూరం అయింది” అను మాటలను ఉచ్చరింతురు. మూడవనాడు బంధువులు వెళ్ళి ఆ సమాధిపై కొంత ఆహారము పెట్టి వచ్చెదరు. అప్పుడువారు "సామీ ! నారాయణా ! భగవంతా ! నీకూ నాకూ దూరం పోయింది. సామిని ఇచ్చినవారు మీరు, తీసికోపోయినవారు మీరు, సామిదగ్గర పోయి చేరాలనేగా. దండం" అని అందురు.

హైదరాబాదు ప్రభుత్వమువారు తమ అభివృద్ధి ప్రణాశిక ద్వారా చెంచులను బాగుపరచి, వారిని రాతియుగపు నాటి అనాగరిక స్థితినుండి, ఎక్కువ నాగరకమైన జాతుల స్థితికి తీసికొని వచ్చినారు. ఈ ప్రణాళిక 1942 లో ప్రారంభింపబడినది. ఇది 'అమరాబాదు గ్రామీణ సంక్షేమ సంఘము' అను పేరుతో పిలువబడుచున్నది.

రా. ప్ర.


చెకోస్లావేకియాదేశము (చ) :

ప్రథమ ప్రపంచ సంగ్రామానంతరము 1918 సంవత్సరము అక్టోబరు 28 తేదీన చెకోస్లావేకియా ప్రజాప్రభుత్వము ఏర్పడినది. చెకోస్లావేకియా యూరప్ ఖండములో, కీలకమయినస్థానములో, పర్వతశ్రేణులచే చుట్టబడి యున్నది. వైశాల్యములో ఇది పెద్దదేశము కాక పోయినను, నైసర్గికస్వరూపమువలనను, అమరికవలనను, ఐరోపా ఖండములో చెకోస్లావేకియాకు ప్రాముఖ్యము లభించుచున్నది. దీనికి ఉత్తరమున జర్మనీ, పోలండ్ దేశాలు; తూర్పున రష్యా; దక్షిణమున హంగేరి, ఆస్ట్రియాలు ; పశ్చిమమున జర్మనీ దేశమును ఉన్నవి. ఈ దేశము బొహీమియా, మొరేవియా - సై లేషియా, స్లావేకియా, రుధేనియా, అను నాలుగు భూభాగములచే ఏర్పడియున్నది. పశ్చిమ భాగములోని బొహీమియా, మధ్య భాగములోని మొరేవియా ప్రాంతములు చాలవరకు పర్వతములచే చుట్టబడి, సమతల పీఠభూమిగాను, తూర్పుననున్న రుధేనియా, స్లావేకియాలు తూర్పునకు ఏటవాలుగా నున్న కార్థేసియన్ పర్వత శ్రేణులలోని పచ్చిక బయళ్ళుగాను ఏర్పడి యున్నది. మొత్తమునకు ఈ దేశములో అరణ్య భాగమే ఎక్కువగా కనబడును.

చెకొస్లావేకియా యొక్క వైశాల్యము 49,381 చ. మైళ్ళు. ఈ దేశములోని ప్రధానమైన నదులు లాబె, వటావా, వ్జోడర్, మొరావా, వాః, డాన్యూబ్ అనునవి. దీనికి రాజధాని ప్రేగ్ నగరము. ఈ దేశ వాసులలో సుమారు 70% వరకు రోమన్ కాథలిక్కు మతస్థులున్నారు. దేశములోని క్రైస్తవ దేవాలయము లన్నియు ప్రభుత్వాధీనమున నున్నవి. 1958 డిసెంబరు నాటికి ఈ దేశపు జనాభా 13,518,021. పర్వత ప్రాంతములలోని పల్లెలలో, వస్త్రములు నేయుట, వస్త్రములపై రంగు రంగు ఎంబ్రాయిడరీ చిత్రముల నల్లుట, ఆట బొమ్మలను చేయుట మున్నగునవి ముఖ్య వృత్తులు. పశువులను వీరు పచ్చిక బయళ్ళలో మేయుటకై విచ్చలవిడిగ వదలరు.

చెకోస్లావేకియా అను పేరు క్రీ. శ. 1880 సం. నుండి ప్రచారమున నున్నది. స్థూలముగా 'స్లావ్ ' జాతికి చెందిన చెక్కులు, స్లావెక్కులు అను రెండు తెగలతో నిండిన ఈ దేశములో, చెక్కులు బొహీమియా, మొరేవియా ప్రాంతములలోను, స్లావెక్కులు స్లావేకియాలోను ప్రధానముగ నివసింతురు. రష్యనులుకూడా ఈ 'స్లావ్’ జాతికి చెందినవారే. ప్రారంభములో చెక్కులు, స్లావెక్కులు అను నీ రెండు తెగల మధ్య చెప్పుకోదగినన్ని విభేదములు లేవు. చారిత్రక రీత్యా ఏర్పడిన ఈ వి భేదముల వలన పశ్చిమ భాగములోని బొహీమియన్ చెక్కులు పదునాల్గవ శతాబ్దమునకే, యూరప్ ఖండమునందు, విశిష్టమైన సంస్కృతిని, నాగరకతను, ఖ్యాతిని గడించిరి. ప్రేగ్ నగరమున, ఆరువందల సంవత్సరములకు పూర్వమే ఒక విశ్వ విద్యాలయము వెలసినది. ఈ బొహీమియన్ చెక్కులు, పదునారవ శతాబ్దమునుండి, జర్మన్ దేశస్థుల అధీనమున నుండుటచే, పారిశ్రామిక జాతిగా వీరు దిద్దితీర్చ బడిరి. తూర్పు తీరములోని స్లావెక్కులు సుమారు వేయి సంవత్సరములుగ హంగేరియన్ల అధీనమున నుండి, కర్షక జాతిగా తయారయిరి. అందులకే 1918 వ సం॥న చెకోస్లావేకియన్ ప్రజాప్రభుత్వ మేర్పడిన తర్వాత, స్లావేకియాలోకూడ పరిశ్రమలు స్థాపించుటకుగాను ప్రయత్నములు జరుగుచున్నవి. యాదృచ్ఛికముగ ఏర్పడిన ఈ రెండు తెగల మధ్య పెంపొందిన విభిన్న ప్రవృత్తులకు పొందిక కల్పించుట చెకోస్లావేకియన్ ప్రజాప్రభుత్వమును ఎదుర్కొను గడ్డు ప్రశ్నలలో నొకటి. ఈ దేశపు నైసర్గిక

716