Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/776

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెంచులు

సంగ్రహ ఆంధ్ర

విశేషముగా చిన్న పడవల ద్వారానే జరుగుచున్నది. చిలీయొక్క ఉత్తరదిశాగ్రమందు పగళ్లు వేడిగానుండును. తీరమందు రాత్రులు కొలది వెచ్చగాను, లోపలిభాగమున చల్లగాను ఉండును. చిలీ మధ్యభాగమందలి శీతోష్ణస్థితి దక్షిణ కాలిఫోర్నియా యొక్క శీతోష్ణ స్థితితో పోల్చదగియున్నది. దక్షిణదిశలో సరోవరప్రాంతమున శీతోష్ణస్థితి అమెరికాకును, పసిఫిక్ సముద్రమునకు పశ్చిమోత్తరమున నున్న శీతోష్ణస్థితితో సమానముగ నున్నది. చిలీ దక్షిణాగ్రమందు పొగమంచు, తుపానులు కారణముగా సగటు శీతోష్ణపరిమాణము తక్కువగానుండును. 'సాంటియాగో' లోని శీతోష్ణపరిమాణములు రెండును తీవ్రముగా (26 డిగ్రీల నుండి 96 డిగ్రీల వరకు) వ్యాపించు చుండును. చిలీలో మంచు అరుదుగా మాత్రమే పడును.

గ. ల. శా.


చెంచులు :

చెంచులు ఆంధ్రప్రదేశమందలి కర్నూలు, మహబూబు నగరము జిల్లాలలోని నల్లమల కొండలలోను. అమరాబాదు పీఠభూమి యందును నివసించు చున్నారు. వారు

చిత్రము - 206

పటము - 1

చెంచుపడతి - ఉంగరాల వెండ్రుకలు ఈ జాతి ప్రత్యేకత

నల్లని శరీరవర్ణమును, వెడల్పయిన ముక్కులును, ఉంగరముల జుట్టును కలిగి యుందురు. వెదురుతోను, గడ్డి కప్పులతోను ఇండ్లను కట్టుకొనుట వీరికి తెలిసియున్నప్పటికిని, వీరు అడవులయందు సంచరించుచు, భోజనార్హమైన కందమూలములను, ఇతర ఫలములను సంతరించుకొను చుందురు. 'పెంట' అనబడు చెంచుపల్లెలలో 13లేక 15 గుడిసెల కంటె ఎక్కువగా నుండవు.

వేటాడుట, ఆహారమును సంపాదించుట - ఇవియే చెంచులయొక్క ఆర్థికవిధానములు. ఉదయమున లేచిన తోడనే 'ఇంటిలో ఆహారము లేదు' అను సమస్య చెంచుల నెంతమాత్రమును బాధపెట్టదు. ఆతడు అడవికి వెళ్ళి తేలికగా ఆ సమయమునకు అచ్చట సందర్భపడిన పదార్థములతో ఆకలి తీర్చుకొని, సాయంకాలమునకు తాను సంపాదించిన పండ్లతో, కందమూలములతో చేరి తన కుటుంబమును, తానును వాటిని భుజించెదరు. చెంచులకు 'రేపు' అను ఆలోచనయే ఉండదు కనుక, ఆహారమును దాచుకొను పద్ధతికూడ వారికి ఉండదు. తెచ్చిన ఆహారము నంతయు అప్పటికప్పుడే కర్చు చేసికొందురు. చెంచు సంఘములో స్త్రీ పురుషు లిరువురును పనిచేయుదురు. ఆహార సంపాదనములో వివిధ పద్ధతులు అవలంబింప వలసిన పని లేకుండుటచే, స్త్రీ పురుషు లిరువురును అన్ని ఋతువుల యందు సమానముగనే ఆహార సంపాదన మొనర్తురు. కాని వేట, తేనె పోగుచేయుట, తట్ట లల్లుట మొదలగు పనులు ప్రత్యేకముగా పురుషులే చేయుదురు. స్త్రీలు ఈలోగా కట్టెలు తెచ్చుపనిని నెరవేర్తురు.

చెంచులలో పెక్కుమంది అడవిలో సంపాదించిన పండ్లు, కందమూలములు, మొక్కలు మొదలైన వాటిపై ఆధారపడి యుందురు. వారి ఆహార సంపాదనకు త్రవ్వు గోలయు, సేకరించిన ఆహారమును ఉంచుకొనుటకై ఒక తట్టయు మాత్రమే కావలయును. చెంచులకు కణుజు, దుప్పి, మేక, ఎలుగుబంటి, కుందేలు, ఉడుత, అడవి పిల్లి, నెమలి, కోడి అదృష్టవశాత్తు పట్టుకొన గలిగిన మరి యే ఇతరములైన చిన్న పక్షులైనను ఆహారముగా ఉపయోగపడును. కాని వారు పెద్దపులి, చిరుతపులి, కుక్క, పాము, కప్ప మొదలగు వాటిని మాత్రము తినరు. వారికి చేపలు పట్టు అవకాశ


714