Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/769

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజ్ఞానకోశము - 3

చిలకమర్తి లక్ష్మీనరసింహము

tears) అనియు, లాటిను భాషలో 'కాయిక్స్‌ జిగాంటీ ' (Coix gigantea) అనియు పిలుతురు. తెలుగులో దీనికి 'గొలివె' అని నామాంతరమున్నది. ఇది పుష్టినిచ్చును. గింజలు మూత్రవృద్ధిచేయును. వేరు ఋతుదోషములను సరిచేయును.

11 వెదురు బియ్యము: వెదురు పొదలు అడవులలో ఏడాది కొకసారి వెన్నులు వేసి, ఆహారముగ నుపయోగించు ధాన్యమునిచ్చును. అడవిజాతులవా రీ ధాన్యము లభించినపుడు ఆహారముగ ఉపయోగించుకొనుచుందురు. వెదురుగింజలు గోధుమలను పోలియుండును.

చిత్రము - 204

వెదురువెన్ను

పటము - 11

ఇది ఇంగ్లీషుభాషలో 'బాంబూ' (Bamboo) అనియు లాటిను భాషలో 'బాంబూసా ఆర్మొనేసియా' (Bambusa armonacea) అనియు పిలువబడుచున్నది. ఇవి గుఱ్ఱములకు జలుబు, దగ్గు వచ్చినపుడు ఉపయోగింపబడును.

బి. వి. ర.


చిలకమర్తి లక్ష్మీనరసింహము :

కవులకు కాణాచియైన రాజమహేంద్రవరమున 19, 20 శతాబ్దములలో నివసించి, ప్రజాదరము పొందిన కవిగా ప్రఖ్యాతిపొందిన చిలకమర్తి లక్ష్మీనరసింహము క్రీ. శ. 1867 సెప్టెంబరు 29 వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాయందలి ఖండవల్లి గ్రామమున వారి మేనమామ యైన పురాణపండ మల్లయ్యశాస్త్రియింట జన్మించిరి. వీరు చిలకమర్తి వెంకన్న, వెంకటరత్నమ్మల ప్రథమ పుత్రులు. తలిదండ్రులు వీరికిపెట్టిన పేరు పున్నయ్య - తరువాత అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి పేరుమీదుగా వీరు లక్ష్మీనరసింహము అని పిలువబడిరి.

బాల్యమున వీరి విద్యాభ్యాసము ముఖ్యముగ వీరి తండ్రిగారి వాసగ్రామమగు వీరవాసరమున జరిగినది. తరువాత వీరి మేనమామగారికి రాజమహేంద్రవరమునకు ఉద్యోగరీత్యాబదిలీకాగా, 1884 సం. న లక్ష్మీనరసింహము కూడా రాజమహేంద్రవరము వచ్చి అచ్చటి పాఠశాలలో స్కూలు ఫైనలు పరీక్షలో కడతేరునంతవరకు చదివిరి. వీరికి చిన్నతనము నుండియు కంటిచూపు తక్కువగుట చేతను, ముఖ్యముగ గణితశాస్త్రమున ప్రజ్ఞాపాటవములు తక్కువగా నుండుటచేతను, కళాశాలవిద్యకు వీరి కవకాశము లేకపోయెను. తరువాత తరువాత వీరికి చూపు బొత్తిగా పోయెను.

అయినను లక్ష్మీనరసింహము అత్యద్భుతమైన ప్రతిభ గలవాడగుటచేతను, అఖండమైన మేధావి యగుటచేతను, బాల్యమున నేర్చిన ఈమాత్రపు విద్యనే ఆధారముగా చేసికొని, ఇతరుల సాయమున అనేక సంస్కృతాంధ్ర గ్రంథములను చదివించుకొని విని, తనకుగల ఏకసంథాగ్రాహిత్వ శక్తిచే ధారణమొనర్చి పాండిత్యము సంపాదించుటయేకాక, రచనమున కుద్యమించి, నాటి మహాకవులలో నొకరుగ ప్రకాశించిరి.

వీరితండ్రి ఎక్కువ సంపన్నులు కానందున, వీరుకూడ

707