Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/759

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చిన్నయసూరి పరవస్తు

వారి యింటిపేరు. 'సూరి' అతని బిరుదము. 'చిన్నయ' యనునది ఆతనిపేరు. చిన్నయసూరి మదరాను రాష్ట్రము నందలి చెంగల్పట్టు జిల్లాలో శ్రీ పెరుంబుదూరు గ్రామమున క్రీ. శ. 1806 వ సంవత్సరమున జన్మించెను. చిన్నయసూరి తండ్రి పరవస్తు వేంకటరంగయ్య, తల్లి శ్రీనివాసాంబ. వీరు తమిళదేశమున స్థిరనివాసము కల ఆంధ్రులు. పరవస్తువారు చాత్తాద (సాతాని) వైష్ణవులు.

చిన్నయసూరి బాల్యమున విద్యాభ్యాసమునందు కొంతకాలము శ్రద్ధలేక అల్లరిచిల్లరగా తిరిగినను, తరువాత అమిత శ్రద్ధాసంక్తులతో తన తండ్రియొద్దను, శ్రీ కంచి రామానుజాచార్యుల యొద్దను, శ్రీ రామశాస్త్రులను విద్వాంసునికడను విద్యాభ్యాసము గావించి, వ్యాకరణ, తర్క, మీమాంసాలంకారాది శాస్త్రము లందును, వేదమునందును చక్కని పరిచయమును సంపాదించెను. సంస్కృతాంధ్ర ప్రాకృతములందును, అరవమునందును చిన్నయ గొప్ప పరిశ్రమగావించి, వాని యందు చక్కని పాండిత్యము సంపాదించుకొనెను. ఇంతేకాక చిన్నయసూరి, తరువాతి కాలమున ఆంగ్లభాషను గూడ కొంత నేర్చికొనియెను. చిన్నయసూరి చిరుతవయసుననే మంచి పాండిత్యమును సంపాదించు కొనుటయే కాక, హయగ్రీవ మంత్రోపాసకుడై దైవ బలమును గూడ సంపాదించెను.

చిన్నయసూరి తండ్రిగారు చెన్నపురిలో అప్పటి ప్రభుత్వముచేత న్యాయాధికారులుగా నియమింపబడినందున, సూరియు వారితోపాటుగా మదరాసు చేరుకొనెను. కొంతకాలమునకు సూరిగారి జనకులు మరణించిరి. అప్పుడు చిన్నయసూరి ఉద్యోగమునకయి వెదుక నారంభించెను. మొదట నాతనికి చెన్నపురిలో అప్పను మిషన్ పాఠశాలయందు కొలదిపాటి వేతనముగల యొక చిన్న యుపాధ్యాయ పదవి లభించెను. మరియొకవైపు సూరి తనకున్న కొలదిపాటి యాంగ్లభాషా పరిచయముతో క్రిష్టియను మిషనరీలకు తెలుగుభాషను బోధించు చుండెను. ఇంకొకవైపు పండితపరీక్షలకు వెళ్ళువారికి వేరుగా భాషా విషయములను బోధించుచుండెను. తరువాత కొన్నినాళ్ళకు సూరి పచ్చయప్ప పాఠశాల యందు పండితుడుగా నియమింపబడియెను. అప్పటి కింకను మదరాసు విశ్వవిద్యాలయము స్థాపితము కాలేదు. ఆ పిదప పది సంవత్సరములకు మదరాసు విశ్వవిద్యాలయమును, దానితోపాటుగా నేటి మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలయు అవతరించెను. చిన్నయసూరి ఆ కళాశాల యందు పండితులుగా నియమింపబడి, 1861 వ సంవత్సరము వరకును అచటనే ఆ యుద్యోగమున నుండిరి. ప్రెసిడెన్సీ కళాశాలయే మదరాసు విశ్వవిద్యాలయమునకు ముఖ్య కళాశాల కనుక, చిన్నయసూరియే మదరాసు విశ్వవిద్యాలయ ప్రధాన పండితులుగా పరిగణింప బడుచుండిరి. ఆ నాడు మొదట ప్రెసిడెన్సీ కళాశాలకు అధ్యక్షుడుగను, తరువాత మదరాసు విశ్వవిద్యాలయ కార్యదర్శిగను నుండిన ఏ. జే. ఆర్బత్‌నట్ దొరయే చిన్నయ పాండిత్య విశేషములు కలరి వారికి 'సూరి' యను బిరుదమును, తత్సూచకమగు సువర్ణ పతకమును బహూకరించిరట ! నాడు మొదలు చిన్నయ 'చిన్నయసూరి' యయ్యెను. 1861 సం.న రాచపుండు పుట్టి సూరి కళాశాలోద్యోగమును వదలివేయవలసివచ్చెను. ఆ మరుసటి సంవత్సరమే యాతడు జీవయాత్ర చాలించెను ఇది యాతని సంగ్రహ జీవితము. ఇక చిన్నయసూరి రచనములను గూర్చి పరిశీలింతము.

చిన్నయసూరి పేరు తలచినంతనే, మనకు స్ఫురించునవి ఆతని 'బాలవ్యాకరణము, నీతిచంద్రికలు ' సూరి బాలవ్యాకరణము 1858 వ సం. మొదటి మారుగా ముద్రితమయి ప్రకటింపబడియెను. నీతి చంద్రిక యంతకు ముందే 1853 వ సం.న రచితమయి ప్రకటింపబడినది. చిన్నయసూరి కీర్తిని ఆంధ్రవాఙ్మయ చరిత్రమున శాశ్వతముగా నిలుపునవి పై రెండు గ్రంథములే యనుటలో సందేహము లేకపోయినను, సూరి రచించిన ఉత్తమ గ్రంథము లింకను బెక్కులుగలవు. చింతామణి వృత్తి, పద్యాంధ్రవ్యాకరణము, సంస్కృతసూత్రాంధ్రవ్యాకరణము, శబ్దలక్షణ సంగ్రహము, విభక్తి బోధిని, ఆంధ్ర ధాతుమాల, అక్షరగుచ్ఛము, ఆంధ్రశబ్దశాసపము, బాలవ్యాకరణము, బాలవ్యాకరణ శేషము, ఆంధ్ర కౌముది యనునవి సూరి వ్యాకరణ రచన అయినట్లు తెలియుచున్నది. ఇదికాక ఆదిపర్వవచనము, నీతి చంద్రిక, ఆంధ్ర కాదంబరి, ఇంగ్లీషు లా చట్టముల భాషాంతరీకరణము,

697