Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/742

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తూరుజిల్లా

సంగ్రహ ఆంధ్ర

బాలుర శిక్షణ పాఠశాల (Training School) కలవు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము కలదు.

పరిశ్రమలు : చంద్రగిరి తాలూకాలో తేలిక లోహ పరిశ్రమల (Light metal Industries) కు సంబంధించిన 13 ప్రతిష్ఠాపనలు కలవు. పలమనేరు తాలూకాలో చందనపు నూనెకు సంబంధించినవి 6 ప్రతిష్ఠాపనములు, మరికొన్ని రాసాయనిక పరిశ్రమలకు సంబంధించిన ప్రతిష్ఠాపనములు కలవు. ఇవన్నియు భారీ పరిశ్రమాగారములు.

నూలు, ఉన్ని, పట్టు నేతపని, త్రాళ్లు పేనుట, బెల్లము వండుట, పాడిపరిశ్రమ, చర్మకారకర్మ, తట్ట లల్లుట, బీడీలు చుట్టుట, నూనెగానుగపని, కోళ్ళను పెంచుట, కుమ్మరపని, బొమ్మలు చేయుట, కంచరపని మున్నగు కుటీర పరిశ్రములను జనులు వృత్తిగా గలిగియున్నారు.

మతములు : ఈ జిల్లాలో మతములను బట్టి 1951 జనాభాలెక్కల ప్రకారము ఈ క్రిందివిధముగా జనసంఖ్య యున్నది:

1. హిందువులు 16,79,832
2. ముస్లింలు 1,11,358
3. క్రైస్తవులు 18,532
4. పార్సీలు 439
5. సిక్కులు 190
6. బౌద్ధులు 21
7. జైనులు 5
మొత్తము 18,10,377

భాషలు : 1951 జనాభా లెక్కల ప్రకారము 18,10,877 మంది జనులుండిరి. వీరిలో 20 మాతృభాషలు కలవారు ఉన్నారు :

1. తెలుగు 13,34,531
2. తమిళము 3,28,679
3. హిందూస్థాని 1,00,121
4. కన్నడము 21,838
5. మలయాళ ము 7,218
6. లంబాడి 6,760
7. మరాఠి 5,036
8. హిందీ 3,951
9. ఎరుకల, ఇరుల, కొరవ 1,658
10. గుజరాతి 297
11. ఇంగ్లీషు, సింధి, బెంగాలి, బర్మీసు, డచ్, ఫ్రెంచి, సౌరాష్ట్ర,జర్మన్,పంజాబి, స్పానిషు భాషలవారు 293
మొత్తము 18,10,377

1960 లో జరిగిన సరిహద్దు మార్పులవలన తమిళులుఎక్కువగా మద్రాసు రాష్ట్రమునకు మారియుందురు. ఇతరుల సంఖ్యలలో మార్పులు, చేర్పులు జరిగినవి.

పుణ్యస్థలములు : తిరుమలకొండమీద శ్రీ వెంకటేశ్వరస్వామివారి, తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామివారి, శ్రీ రామస్వామివారి దేవాలయములు కలవు. ఈ దేవస్థానములయందు జరుగు రథోత్సవములు, బ్రహ్మోత్సవములు ఘనమైనవి. భారతభూమిలోని నలుదిక్కులనుండి తైర్థికులు వచ్చెదరు. ఈ కొండమీద కొన్ని జలపాతములు కలవు. యాత్రికులు పుణ్యముకొరకు జలపాతములందు గ్రుంకు లిడుచుందురు. యాత్రికుల సౌకర్యార్థము దేవస్థానమువారు చక్కని విడుదుల నేర్పాటు చేసియున్నారు.

శ్రీకాళహస్తి పురములో అత్యంత ప్రాచీనమయిన శివాలయ మొకటి కలదు. ఈ దేవుని శ్రీకాళహస్తీశ్వరు డనెదరు. అపరిమితముగా హిందూస్థానములోని- ముఖ్యముగా దక్షిణదేశము నుండి - తైర్థికులు ఈ దేవుని దర్శనార్థము వచ్చుచుందురు. ఇచ్చట శివరాత్రి సందర్భమున 10 రోజులపాటు మహోత్సవము జరుగును. ఈ సమయముననే శివదేవుని రథోత్సవము కూడ మిగుల వైభవముగా జరుగును. పృథివ్యాపస్తేజోవాయురాకాశములను పంచభూతములకు సంబంధించిన లింగములలో నొక్కటి ఈ దేవాయతనమునందు కలదు. కాళహస్తిలో నున్న లింగము వాయులింగ మని ప్రతీతి కలదు. శ్రీకాళహస్తి స్వర్ణముఖీ నదీతీరమున గలదు.

పుత్తూరులోని ద్రౌపదీ దేవ్యాలయము, కొత్తకోటలోని అగస్త్యేశ్వరాలయము, చిత్తూరులోని రామస్వామి ఆలయము, వెలిమలగ్రామకొండలమీద నున్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయము, బంగారుపాలెం తాలూకాలోని మొగిలి గ్రామమందున్న మొగిలేశ్వరాలయము మున్నగునవి ప్రసిద్ధ దేవాలయములు.

682