Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/740

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తూరుజిల్లా

సంగ్రహ ఆంధ్ర

భూములు కలవు. పలమనేరు, మదనపల్లి తాలూకాలలో రేగడి, గరప (Loam), ఇసుక నేలలు లేవు. వాయల్పాడు తాలూకాలో రేగడి, ఇసుక నేలలు లేవు (1951).

నీటివసతులు : నీటి పారుదల, వ్యవసాయము (irrigation) నకు సంబంధించిన పెద్ద నిర్మాణములు ఈ జిల్లాలో లేవు. మెట్టపంటల, వాణిజ్యపుపంటల వ్యవసాయము విరివిగా సాగుచుండును. ఈ పంటల వ్యవసాయమునకు వర్షపాతమే ఆధారము. రైతు లెక్కువగా పండ్లతోటలను పెంచుటయందు శ్రద్ధ గైకొను చుందురు. వర్షాధారమున నిండిన చెరువుల క్రిందను, కొన్నినదుల కాలువలక్రిందను, ఊటకాలువలక్రిందను వరి పంట సాగగుచుండును. ఈ వసతులకు సహాయముగా రైతులు త్రవ్విన బావులనీరు కొరతను తీర్చుచుండును.

1. చిత్తూరు తాలూకాలో వానకాలములో నిండిన చెరువులు, స్వంతబావులు వ్యవసాయమునకు మూలా ధారములు. ఈ తాలూకాలో వరిపంట ఋతుపవనము (Monsoon) యొక్క వర్షపాతముపై ఆధారపడి యున్నది.

2. పుంగనూరు తాలూకాలో మాగాణి వ్యవసాయమునకు వానకాలములో నిండు చెరువులు, స్వంతబావులు ముఖ్యమైన జలాధారములు. ఈ తాలూకాలో వర్షపాతము అల్పమగుటచే ఇది దుర్భిక్షము పాలగుట కలదు.

3. పలమనేరు తాలూకాలో తూర్పు భూభాగములో నీటిపారుదల వ్యవసాయమునకు కౌండిన్యనది ఆధారముగా నున్నది. వానలతో నిండిన చెరువులు, స్వంతబావులు, మాగాణి వ్యవసాయమునకు ఇతర ఆధారములై యున్నవి.

4. మదనపల్లి తాలూకాలో పెద్దతిప్ప సముద్రము చెరువు, రంగసముద్రము చెరువు, కందుకూరు చెరువు, చిన్న తిప్పసముద్రము చెరువు అను 4 పెద్దచెరువులు గలవు. ఇవి తమ తమ ఆయకట్టులకు తగినంత నీరును సమకూర్చు చుండును. ఈ తాలూకాలోని ఇతర చెరువులు నమ్మదగినవి కావు. మాగాణి వ్యవసాయమునకు స్వంతబావులు అధికముగా తోడ్పడుచుండును. సకాలమందు వానలు సరిగా కురియక పోవుటచే ఈ తాలూకా తరచు ఇబ్బంది పాలగుచుండును.

5. వాయల్పాడు తాలూకాలో వానకాలములో నిండిన చెరువులు, స్వంతబావులు, మాగాణి వ్యవసాయమునకు జలాధారములు. ఈ తాలూకాలో వర్షాభావముచే కరువు కాటకములు తొంగిచూచు చుండును.

6. చంద్రగిరితాలూకాలో స్వర్ణముఖి, కల్యాణి నదులనుండి బయలుదేరు ఊటకాలువలే మంచి జలాధారములై మాగాణి వ్యవసాయమునకు దోహద మొసగుచున్నవి. తక్కువ పడిన నీరును బావులు సమకూర్చు చుండును. ఈ బావులలో నీటి ఊటలు మంచివి కలవు. ఇచ్చట వర్షాధారమున నిండు చిన్న చిన్న చెరువులును కలవు.

7. కాళహస్తి తాలూకాలో స్వర్ణముఖీనది కాలువలు పెక్కు చెరువులను నింపుచుండును. ఈశాన్య ఋతుపవనములు పూర్తిగా లోపించిననే తప్ప ఈ తాలూకాలో కరవుబాధకు ఆస్కారములేదు.

8. పుత్తూరు తాలూకాలో కొంతభాగము ఆరణి, నగరీ నదులు పల్లపు వ్యవసాయానుకూలములుగా నుండును. ఈ తాలూకాలో వర్షాధారమున నిండెడు స్వంత బావులు అధికముగా కలవు. ఈ తాలూకా సాధారణముగా కరవుకాటకములకు గురికాదు. (1951).

పంటలు : ఈ జిల్లాలో వరిపంటయే ముఖ్యమైన ఆహారపు పంట. కుంబు, రాగి పైరులును విరివిగా పెరుగును. చోళము, కొఱ్ఱ, వరిగె, సామలు పరిమితముగాపండును. వేరుసెనగ ముఖ్యమైన వాణిజ్యపుపంట. చిత్తూరు తాలూకాలో కూరగాయలు, పండ్లు పండించు భూమి ఎక్కువగా కలదు. ఈ జిల్లాలో నిమ్మ, మామిడిపండ్ల రకములు విరివిగా పండును.

పెసలు, కందులు, మినుములు, సెనగలు ఎక్కువగా పండును. వేరుసెనగ, ఆముదాలు, నువ్వులు, పొగాకు అను వాణిజ్యపు పంటలలో వేరుసెనగయే హెచ్చుగా పండును.

ఈ జిల్లాలో మామిడిచెట్లు, చింతచెట్లు విరివిగానున్నవి. మామిడిపండ్లు ఎక్కువగా ఇచ్చటినుండి బొంబాయికిని, బొంబాయినుండి ఇతర భారత ప్రాంతములకే గాక పాశ్చాత్యదేశములకును ఎగుమతి యగుచుండును.

మొత్తము విస్తీర్ణము 17,69,290 ఎకరములలో అడవిప్రాంతము 5,23,721 ఎకరములు; సాగునకు పనికి

680