Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/730

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్తూరు వి. నాగయ్య

సంగ్రహ ఆంధ్ర

పాఠశాల చదువుమాట అటుండనిచ్చి, నాగయ్య ఎక్కడెక్కడ సంగీతకచేరీలు జరుగునో అక్కడక్కడకు పరుగెత్తెడివాడు. ఒక దూరగ్రామములో మహావిద్వాంసు డొకడు సంగీతము పాడుచుండెనని విని, నాగయ్య తన చెవులపోగులను తెగనమ్ముకొని, వాటివలన వచ్చిన డబ్బుతో రై లెక్కి, ఆ యూరికి వెళ్ళి, ఆ విద్వాంసుని సంగీతమును విని ఇంటికి మరలివచ్చెను. పుత్రుని సంగీత కళాతృష్ణను అవగాహన చేసికొన్నతండ్రి, సంగీతవిద్వాంసుడయిన చిత్తూరు పేరయ్యపిళ్ళేకు నాగయ్యను అప్పగించెను.

నాగయ్య దృష్టి కేవల సంగీతముపైననే కాక, నాటకములమీద కూడ ప్రసరించెను. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించు నాటకములలో ఆతడు పాల్గొని పెక్కు పారితోషికములను పొందెను. ప్రహ్లాదుని భూమికలో ఆయన తన్మయత్వమును పొంది, ప్రేక్షకులను తన్మయులుగా చేయగలిగెను.

ఒకసారి సంగీత మహావిద్వాంసు లయిన పుష్పవనం అయ్యర్, గోవిందస్వామిపిళ్ళేల సంగీతకచేరీకి నాగయ్య వెళ్ళుట తటస్థించెను. కచేరీ పూర్తయిన వెంటనే ప్రేక్షకులు వారి వారి ఇండ్లకు వెడలిపోయిరి. కాని నాగయ్య అట్లే ఉండిపోయి, పుష్పవనం అయ్యరు ముఖమువంక ఆదేపనిగా చూడసాగెను. తనను తదేక ధ్యానముతో చూచుచున్న కుఱ్ఱవానిని అయ్యరు: "ఏమిట్రా అబ్బాయి నీ పేరు ?" అని ప్రశ్నించెనట. కుఱ్ఱవాడు తన అసలు పేరు చెప్పక, నాటకములలో తన అభిమాన పాత్రను స్మరించి, “నా పేరు ప్రహ్లాదుడు" అని జవాబిచ్చెనట. ఈ కుఱ్ఱవా డెవరో కళాపిపాసి అని గ్రహించిన పుష్పవనం అయ్యరు, “నీ కేమైనా సంగీతము వచ్చునా?" అని ప్రశ్నించగా, “ఓ! వచ్చును!” అని పిల్లవాడు బదులు పలికెనట ! వెంటనే అచ్చట నున్న గోవిందస్వామి పిళ్ళె వయొలిన్ తీసికొని వాయించుచుండగా, కుఱ్ఱవాడు సుమారు రెండుగంటల పర్యంతము ప్రహ్లాదుని పాత్రలో తాను పాడిన పాటలు, పద్యములు కంఠమెత్తి పాడెను. అయ్యరుయొక్క ఆనందమునకు అవధులు లేకపోయెను తన చల్లని చేతితో ఆయన నాగయ్యమీద పుష్పవృష్టిని కురిపించి, "భవిష్యత్తులో నీవు చక్కని కళాకారుడ వయ్యెదవు!" అని ఆశీర్వదించెను. నాగయ్య ఈ సంఘటనను ఇప్పటికిని తన స్మృతిపథమునకు తెచ్చుకొని ఆత్మానందము ననుభవించుచుండును.

నాగయ్య జీవితములో మరపురాని మరియొక సంఘటన, విఖ్యాత నటుడు ఎస్. జి. కిట్టప్పయొక్క దర్శనము. 'దశావతారములు' అను నాటక మునందు శ్రీ కిట్టప్ప కృష్ణుని భూమిక దాల్చి ప్రేక్షకుల హృదయమును చూరగొనెడివాడు. నాగయ్య కృష్ణపాత్రనుచూచి తన్మయుడై కిట్టప్పను సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మగా భావించి, రంగస్థల మెక్కి, ఆతనిముందు కొబ్బరికాయ కొట్టి, కర్పూరహారతి వెలిగించి, సాష్టాంగ దండప్రణామ మొనరించెను. ఇది చూచి ప్రేక్షకులలో పెక్కురు వింతగా నవ్వసాగిరి. ప్రాజ్ఞులు కొందరు పిల్లవాని భక్తి తత్పరతను ప్రశం

చిత్రము - 192

పటము - 2

(దశరథ పాత్రధారి)

670