Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/721

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చికిత్సాశాస్త్రము (ఆయు)

ప్రయోగ విధానములను మాత్రమే చెప్పక, అవ్యక్తము మొదలు మహదాది, ప్రకృతి, వికృతి తత్త్వాత్మకమగు సృష్టిక్రమమును, పంచభూతాత్మకముగ మానవ కళేబర నిర్మాణమును, శరీర రచనాసామగ్రిని, సమ, విషమ, ప్రకృతి లక్షణములను, శరీర వర్ణాకృతి ప్రమాణములను, సత్వ, రజస్తమో భేదములచేత, సాత్విక, రాజస, తామసాహంకార సహితముగ దేవగంధర్వాది మానవ ప్రకృతుల నిరూపణము, దేశకాల, వయోఽవస్థా విశేషముల చేతను, ఆహారవిహారములు కారణముగను, వాతాదిదోషములు దూషితములై శరీరమున గలిగించు వివిధవ్యాధి విశేషములను, వాతాదిధాతు వికల్పముల వలన వ్యాధుల అనేకత్వమును అనంతముఖముల విస్తృతమైయున్న వ్యాధిశమనక్రియా కలాపములను, రస, గుణ, వీర్య, విపాక, ప్రభావములచే, సువర్ణాదిలోహములు, పారద, గంధక, తాళకాది రసోపరస మహారసములు, ఓషధులు, చికిత్స సామగ్రిగా నుపయోగించు విజ్ఞానమును సంపూర్ణముగ విమర్శించి, విశదీకరించి, నిరూపించినది భారతీయ చికిత్సాశాస్త్రము.

శరీరము రోగములకు గురికాకుండ, సర్వదాపటిష్ఠమై, బలిష్ఠమై యుండునట్లు కాపాడుకొనుటయు - ఆధివ్యాధులకు లోనై ఆయువు క్షీణించి పోకుండ సంరక్షించుకొనుటయు - గళిత జవ్వనమై జరామరణావకుంఠిత మైన శరీరమును నిత్యయౌవనాయతనముగా, అజరామరముగా దిద్దుబాటుచేయుటయు, నిత్యదుఃఖాత్మకమగు జీవితమును నిత్యానంద సంధాయకముగ రూపొందించుటయు = శాసించి చెప్పినది. అందువలన ఇది చికిత్సాశాస్త్రమని భారతీయ విజ్ఞానవిదులు వాడుకచేయుచు వచ్చిరి.

ఇట్లు చెప్పబడిన చికిత్సాశాస్త్రము ఎనిమిది భాగములు గలది. ఈ ఎనిమిది భాగములకు అంగములనియు వాడుక గలదు.

1. కాయచికిత్స : కంఠమునకు దిగువగల కరచరణాది ప్రత్యంగ సంగతమగు కళేబరమున కలుగు వ్యాధులు, నిదానము, జ్యోతిష కర్మవిపాక సిద్ధాంతము, చికిత్సా విధానము, ఇందు చెప్పబడినవి.

2. బాలచికిత్స : జననాదిగ నాలుగైదు సంవత్సరముల వయస్సువరకుగల శిశువులకు కలుగు వ్యాధులు, కారణములు - ఔషధప్రమాణము - నిదానము గ్రహచికిత్స విధానము మొదలైనవి ఇందు చెప్పబడినవి.

3. గ్రహచికిత్స : భూత, ప్రేత, పిశాచాది గ్రహములు మానవుల నావరించుటకుగల కారణములు తొలగించుట కవసరమగు శాంతి, బలి, మంగళ క్రియాకలాపములు ఇందు చెప్పబడినవి.

4. ఊర్ధ్వంగచికిత్స : కంఠమునుండి పైనగల కర్ణాస్య నాసికా నేత్రసంగతమగు శిరస్సునందు గలుగు వ్యాధులు- నిదానచికిత్సావిధానము - ఇందు చెప్పబడినవి.

5. శల్య చికిత్స : శరీరమునందేభాగమునైనను విరిగిన ఎముకల నతుకుట, తీసివేయుట, శస్త్రముచేయుట, వ్రణచ్ఛేదవ, ఆలేపన, బంధనములను చికిత్సా విధానము లిందు చెప్పబడినవి. ఈ శస్త్రచికిత్సావిధానమునందొక విశేషము. నాసికా చ్ఛేదనమునందు, కృత్రిమ నాసికాసంధానమునందు, భగ్నాస్థిసంధాన భేదనచ్ఛేదనములందు మెలకువలు విశేషముగ చెప్పబడినవి. అసలీ చికిత్సా విధానమునందు అస్థిపంజర పరిశోధనయే వేరు.

6. దంష్ట్రా చికిత్స : ఇది విషచికిత్స. సర్పాది విషజంతువుల విషప్రభావము, వ్యాఘ్రాది క్రూరజంతువుల విషప్రభావము - అవి మానవ శరీరమున ప్రసరించినపిమ్మట కలుగు వేగములు, పెట్టుడుమందులు, వీటివేగములు, తెలిసుకొనుట, లేపన, నస్యాంజన చికిత్సావిధానము లిందు చెప్పబడినవి.

7. జరాచికిత్స : దీనిని రసాయన చికిత్సయని వాడుదురు. జరయన యౌవనము సడలిపోవుట (ముసలితనము). ఇందనేక విషయము లంతర్భూతములు. వెండ్రుకలు నెరయుట, చెవులు వినబడకపోవుట, చత్వారము అనగా నలుబది సంవత్సరములకు సహజముగా కనులచూపు మందగించుట, శరీరము ముడతలుపడుట - పండ్లూడుట, మున్నగు లక్షణములు కలుగకుండునట్లును, అజాగ్రత వలన ఇట్టి లక్షణములు పొడచూపిన నివారణ చేయునట్లును, ఈ చికిత్సావిధానము చెప్పబడినది. ఇందొక విశేషము ఏమన, జరాక్రాంతులను, నూతన యౌవన వయస్కులనుగా చేయుట - ఈ చికిత్సయందు ఆహార విహార నియమములు, ధరించుబట్టలు, ఉండుటకు వసతులుగల నివాసము వివరముగా కలవు.

661