విజ్ఞానకోశము - 3
చార్వాకము
అంతర్జాతీయ ప్రసిద్ధిచెందిన చాప్లిన్‌యొక్క ఆంతరంగిక జీవితమును కూడ తెలిసికొనవలె ననెడి అభిలాష ఆతని అభిమానులకు ఉండుటలో ఆశ్చర్య ముండదు. 1918 లో ఆతడు మిల్ డ్రెడ్ హారిస్ అను వనితను వివాహ మాడెను. ఆరేళ్ళపాటు సాంసారిక జీవితముగడిపి చాప్లిన్ ఆమెకు విడాకు లిచ్చెను. 1924 లో చాప్లిన్ లొవిటామెక్ మాటీని అర్ధాంగిగా స్వీకరించెను. ఆమెవలన ఆతనికి ఇద్దరు కుమారులు కల్గిరి. అనంతర మాతడు ఆమెనుగూడ వదలెను. 1936 లో ఆతడు పాలెట్ గోడార్డ్‌ను పరిణయ మాడెను. మనస్తాపములు కారణముగా ఆమెను సయితము పరిత్యజించెను.
1943 లో ఆతడు ఊనా ఓనీల్ అను నామెను ధర్మపత్నిగా గ్రహించెను. ఆ నాటినుండి ఈ నాటివరకు ఆమె చాప్లిన్‌కు సహధర్మ చారిణియై ఆతని హృదయములో స్థావర మేర్పరచుకొనగల్గెను. ఈమెవలన ఆతనికి ముగ్గురు కొడుకులు, అయిదుగురు కూతుళ్లు కలిగిరి. ఊనాను వివాహమాడిన నాటినుండియే తనకు సిసలయిన సాంసారిక సౌఖ్యము లభించిన దని ఇటీవల చాప్లిన్ ఒక సందర్భమున ప్రకటించెను.
చార్లీ చాప్లిన్ కోట్లకొలది ధనము గడించెను. వివిధ దేశములలో నిరుపేదలకు, అనాధలకు ఏర్పడియున్న పెక్కు సంస్థలకు అతడు భూరి విరాళము లొసగెను. ప్రస్తుత దశలో విశ్రాంతి తీసికొనుచున్న చాప్లిన్, తన పెద్ద కుమారుడు ప్రపంచశాంతికి సంబంధించిన ఇతివృత్తము నాధారముగా చేసికొని తీయుచున్న ఒక చిత్రము యొక్క నిర్మాణ కార్యకలాపమును పర్యవేక్షించు చున్నట్లు తెలియుచున్నది.
ఇం. వేం.
చార్వాకము :
క్రీ. పూ. 6 వ శతాబ్దికిని, క్రీ. శ. 2 వ శతాబ్దికిని నడుమ నుండిన కాలము పురాణయుగమని (Epic period) చరిత్రకారు లభిప్రాయపడుచున్నారు. ఆయుగము మేధావిభూతికిని, అత్యంతగాఢతత్త్వవిచారమునకును, సర్వతోముఖ వికాసమునకును తావలమయి యుండెను.
అది చార్వాకులయొక్క యు, బౌద్ధులయొక్కయు, శకముగా పరిగణింపబడుచు వచ్చెను. సహజజ్ఞాన నిర్ణయము (intuition) నకు ప్రతిగా విచారపద్ధతియు, ప్రవృత్తికి బదులుగా తాత్త్వికచింతనమును ప్రాబల్యము నొందసాగెను. ఆ పురాణయుగమందు పెక్కు తాత్త్విక సిద్ధాంతములలో మీమాంసలు జరుపబడి, ప్రయోగములు చేయబడెను. లెక్కకు మిక్కిలిగా నూతన తాత్త్విక ధోరణులు ప్రతిపాదింపబడెను. సాంఖ్య, యోగ - దర్శనములు ప్రాథమిక రూపములలోను, న్యాయ, వైశేషిక దర్శనములు, స్వతంత్ర ప్రతిపత్తిలోను వికాసము చెందినవి. మీమాంసాద్వయము మాత్రము వేదమంత్ర ప్రతిపాదనలనుండియే సరాసరి యుద్భవించినది. ఈదర్శన విధానములన్నియు పురాణ యుగాంతములోనే నిస్సంశయముగను, అసందిగ్ధముగను ప్రచారములోనికి వచ్చినవి.
చార్వాకముయొక్క ఆవిర్భావము : తత్త్వశాస్త్రమువలె భౌతికవాదము ప్రాచీనమైనది. బౌద్ధ యుగమునకు పూర్వమే భౌతికవాదము ఒక సిద్ధాంతరూపములో ప్రచారమం దుండెను. ఋగ్వేదమునందలి మంత్రములలో భౌతికవాదము బీజరూపములో కాననగును. రామాయణము, భారతమువంటి ఇతిహాసములలోగూడ భౌతిక వాదమునుగూర్చి ప్రసక్తి కలదు. మనుస్మృతికారుడు నాస్తికులను గూర్చియు, పాషండులనుగూర్చియు, వక్కాణించి యున్నాడు. “బృహస్పతి సూత్రములు" అనునది భౌతికవాద సిద్ధాంతముపై సాధికారముగా రచించబడిన యొక ప్రాచీనగ్రంథమయి యున్నది. కాని ఈ సూత్రములు అంతరించినవి. 'సర్వదర్శన సంగ్రహము' అను గ్రంథముయొక్క ప్రథమాధ్యాయమును, వాత్స్యాయన 'కామసూత్రముల' యందలి ప్రథమ, ద్వితీయ అధ్యాయములును, హరిభద్రుని 'షడ్దర్శన సముచ్చయము' ను, భిన్నధోరణులను ప్రతిపాదించిన తత్త్వవేత్తల యొక్క వాదోపవాదములును ప్రధానములైన మూలాధారముగ నున్నవి.
భౌతికవాదమునకు అర్థము : చార్వాకనామము సాధారణముగా భౌతికవాదికి అన్వయింప బడుచున్నది. 'చార్వాక" అనునది ఏతన్మత ప్రవక్తయొక్క నిజ నామముగా ఒక వాదము కలదు. 'చార్వాక ' పదము ప్రారంభములో భౌతికవాదికి పెట్టిన వర్ణనాత్మక నామధేయమై యుండునని మరియొకవాదము కలదు. ఏలయన "తిని,
657