చార్లీ చాప్లిన్
సంగ్రహ ఆంధ్ర
పూర్వకముగా తెలిసికొనుటచే, చాప్లిన్ ఆ హోదాను కూడ చేపట్టక తప్పినది కాదు.
ఎసెనీ చిత్రములపై చార్లీయొక్క ప్రభావముద్ర తీవ్రముగా పడుటచే, అవి ఖండాంతరములకు పోయి ఆతనికి గొప్పపేరు ప్రతిష్ఠ లార్జించి పెట్టెను. వ్యాపార రీత్యా అవి ఆ కంపెనీ యజమానులకు బండ్లమీద ధనపు రాసులను తెచ్చి పెట్టినవి.
1916 లో చాప్లిన్ మ్యూచుయల్ కంపెనీ కాంట్రాక్టు పత్రముపై సంతకము పెట్టెను. ఈ కాంట్రాక్టును అనుసరించి ఆతడు పన్నెండు చిత్రములను తయారుచేసి ఆరులక్షల డెబ్బదివేల పౌనులను పుచ్చుకొనెను. ఇంతగొప్ప మొత్తమును పుచ్చుకొన్న మహానటులు ఆ దినములలో ఎవ్వరును లేరు. ఆతడు నిర్మించిన పన్నెండు చిత్రములు విపరీతముగా ధనమును తెచ్చుటతో, ఆ కంపెనీవారు మరొక పన్నెండు చిత్రములకు కాంట్రాక్టు వ్రాయుమని ఆతనిని కోరిరి. నటనా ప్రపంచములో దాస్య శృంఖలములను త్రెంచుకొని స్వేచ్ఛా జీవితమును గడపవలె నని అభిలషించుచున్న చార్లీ చాప్లిన్ ఆ కాంట్రాక్టును నిరాకరించి తన స్వంతకంపెనీ పతాకమును గగనవీథిలో ఎగుర వేసెను.
అంతట నాతడు హాలీవుడ్‌లో ఒక స్టూడియోను నిర్మించి 'యునై టెడ్ ఆర్టిస్టు కార్పొరేషన్ ' అను సంస్థకు అంకురార్పణ కావించెను. ఈ సంస్థలో మేరీపిన్ ఫర్డ్, డగ్లస్ ఫెయిర్ బాంక్స్ అను వారలు భాగస్థులయిరి. ఈ సంస్థ యాజమాన్యమున తీయబడిన 'ఏ డాగ్స్ లైఫ్', 'షోల్డర్ ఆమ్స్', 'సన్నీ సైడ్', 'ఎ డిస్ ప్లెజర్', 'ది కిడ్', 'ది ఐడిల్ క్లాస్, ' పే డే', 'ది పిల్ గ్రిం', 'ది గోల్డ్ రష్', 'ది సర్కస్', 'సిటీ లైట్స్' మొదలయిన చిత్రములు దేశ దేశములలో పెక్కు పర్యాయములు ప్రదర్శింపబడినవి. ఇవి శబ్దరహిత చిత్రము లయినను, ప్రేక్షకులకు గొప్ప రసానుభూతిని చేకూర్చగల్గిన వని చెప్పకతప్పదు. ముఖ్యముగా 'ది గోల్డ్ రష్' అను చిత్రమును చూచిన వారు చాప్లిన్ మూర్తిని తమ స్మృతిపథముననుండి తుడిచి వేయలేరు.
1936 లో చలనచిత్ర రంగములో శబ్దము చొరబడినది. చాప్లిన్ ఈ శబ్దప్రవేశము నెడల హర్షము ప్రకటించుటకు నిరాకరించెను. ఆంగిక సంబంధమయిన నటనా చాతుర్యమును ప్రకటించుటకు మూగచిత్రమునందే అధికముగా ఆస్కారముండగలదని ఆతని వాదన. ఆ సంవత్సరములో ఆతడు నిర్మించిన 'మాడరన్ టైమ్స్' చిత్రములో శబ్దము నేపథ్యములో ఇయ్యబడు కొన్ని ధ్వనులలోనే మనకు వినపడును.
'శబ్ద' ఉద్యమమునకు చాప్లిన్ వ్యతిరేకి అయినను, కాలానుసారముగ ఆతడు వ్యవహరింపక తప్పలేదు. 1940 లో ఆతడు 'ది గ్రేట్ డిక్టేటర్', 1947 లో 'మన్ష్యూర్ వెర్ డా', 1952 లో 'లైమ్ లైట్', 1957 లో 'ఏ కింగ్ ఇన్ న్యూయార్క్' అను శబ్దచిత్రములను తీసెను. వీటిలో ఆతడు ధరించిన పాత్ర లన్నియు వ్యంగ్య ధోరణిలో ఈనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను విమర్శించెను. బాల్యమునుండియు కటిక దరిద్రబాధను అనుభవించిన వాడగుటచే, చాప్లిన్ తాను ధరించిన వివిధపాత్రలద్వారా శ్రామికజీవులకు అండగానిలిచి, కష్టజీవుల శ్రమశక్తిని కొల్లగొట్టెడి పెట్టుబడిదారీ వర్గములపై కత్తి జళిపించెను. ఆతడి ఆశయములను, అభిరుచులను అర్థముచేసికొనిన ఆమెరికా ప్రభుత్వము ఆతనికి అమెరికా పౌరసత్వ హక్కును ఇచ్చుటకు ఒక విధముగా నిరాకరించిన దన్న విషయము జగమెరిగిన సత్యము.
పెద్ద చదువులు చదువకపోయినను ప్రపంచానుభవమును విశేషముగా సంపాదించినవాడగుటచే, చాప్లిన్ తన పాత్రలద్వారా ఆధునిక నాగరికతలోని మంచి చెడుగులపైన వెలుతురును ప్రసరింపగల్గెను. ఆధునిక సాహి త్యమునందును కూలంకషపరిజ్ఞానముగడించుటచే, చాప్లిన్ తన చిత్రములలోని మాటలను, పాటలను తానే వ్రాసుకొన్నాడు. సంగీతములో ఆతనిప్రతిభఆపారము. వ్యక్తము 'లైమ్ లైట్' అను చిత్రములో ఆతని పాండితీపటిమ కాగలదు. 'ది గ్రేట్ డిక్టేటర్' అనెడి చిత్రములో అతని అభ్యుదయపు పోకడలు మనకు ఆవగాహనము కాగలవు.
మూగచిత్రములకాలమునుండి శబ్దచిత్రములకాలము వరకు ఏకధాటిగా నటులలో ఒక వెలుగు వెలిగినవాడు చార్లీ చాప్లిన్ తప్ప మ రెవ్వరును కానరారు. అర్ధశతాబ్దము పర్యంతము అవిచ్ఛిన్నముగా కీర్తిప్రతిష్ఠలు సంపాదించిన గౌరవము ఆ మహానటున కొక్కనికే దక్కినది.
656