చామర్లకోట
సంగ్రహ ఆంధ్ర
చాళుక్య భీమేశ్వర దేవహర్మ్యం
త్రింశత్సమాభూతలమన్వరక్షత్"
అని యొక శాసనమున గలదు. చాళుక్యభీముడే తన పేరును దేవున కిడెనని కొందరందురు. ఈశ్వరపుత్రుడగు కుమారస్వామిచే నిట శివలింగము ప్రతిష్ఠితమగుటచే నిది కుమారారామము, స్కందారామము అని కొన్ని శాసనములలో బేర్కొనబడినది. తారకాసురుని మెడలోని అమృతలింగమును కుమారస్వామి యైదు ఖండములుగా ఖండింప నందొక ఖండ మిట బడినందున నీ క్షేత్రము పంచారామ క్షేత్రములలో నొకటియై ప్రఖ్యాతమైనది. 'అదె కుమారారామ మాహర్మ్యరేఖయ చాళుక్యభీమేశు సదనవాటి' అని శ్రీనాథ కవిసార్వభౌముడీ క్షేత్రమును గూర్చి తన భీమేశ్వర పురాణమున నుగ్గడించెను. చాళుక్య రాజరాజనరేంద్రునికి గూడ భీమేశ్వరుడు ఉపాస్యదైవమై యుండునని "భారత శ్రవణాసక్తియు, బార్వతీపతిపదాబ్జధ్యాన పూజామహోత్సవమున్... ఇవి యేనున్ సతతంబు నాయెడ గరంబిష్టంబులై యుండు" నన్న భారతవాక్యమువలన గ్రహింపదగును. ఇట చాళుక్యభీముని కోట ధ్వంసమైపోగాఁ బిమ్మట క్రీ. శ. 1400 ప్రాంతమున కాటయవేమారెడ్డి రాజమహేంద్రవరమున రెడ్డిరాజ్య పాలనము గావించుచు తూర్పుదేశములను జయించి భీమవరమున పూర్వము కోటయుండిన స్థలమును ద్రవ్వింపగా, మహిషాసురమర్దని శక్తి విగ్రహము దొరకినది. దానికి శ్యామలాదేవి యను పేరిడి, ఆలయము గట్టించి, యట గ్రామము నిర్మించి, దానికి శ్యామలా దుర్గమని పేరిడెను. అదే సామర్ల కోట. ఇది సామర్లకోట కై ఫియతునందు వ్రాయబడినది. ఆ మహిషాసురమర్దని తరువాత భీమేశ్వరాలయమును చేరుకొన్నది. 'భీమనాయక దేవు పేరురంబున గ్రాలు భుజగహారములకు భుక్తి వెట్టి, రాజనారాయణస్వామి రమ్యభవన తార్క్ష్య కేతనపతికి నర్తనము గరపి' అని శ్రీనాథకవి యిచ్చటి గాలులను వర్ణించెను. ఈ భీమేశ్వర, నారాయణస్వాముల ఆలయములలో ముప్పది శాసనములు గలవు. వీనిలో క్రీ. శ. 1087 నాటిది అతి ప్రాచీనము. 1393 నాటి తామ్రశాసన మొకటి కాటయ వేమారెడ్డి రాజనారాయణస్వామికి భూరిదానములు చేసినట్లు తెల్పును.
చాళుక్యభీము డీ భీమేశ్వరాలయమును, దాక్షారామ భీమేశ్వరాలయమును ఇంచుమించుగ నొకేరీతిగా నిర్మించెను. ఆఆలయము చుట్టును పదు నెనిమిది యడుగుల ఎత్తు గల ప్రాకారమున్నది. ప్రాకారము నలుమూలల నాలుగు గోపురములున్నవి. యాత్రికు లుత్తరద్వారమున లోపలి యావరణములో ప్రవేశించి, తూర్పు ద్వారమునకు వచ్చిన నట కోనేరు గలదు. కోనేటిమధ్యమున నొక మండపము ఉన్నది. కోనేటిలో యాత్రికులు స్నానతర్పణములు గావింతురు. ధ్వజస్తంభమునుదాటి ముందున కేగిన నట పెద్ద నంది గలదు. లోపలి ప్రాకారములో గణపతి, సరస్వతి మొదలగు దేవతల విగ్రహములున్నవి. స్వామి ప్రధానాలయము రెండంతస్తులుగా నుండును. దాక్షారామము నందువలెనే క్రిందియంతస్తు చీకటికొట్టు. మీదియంతస్తుననే అభిషేకాదులుచేయుదురు. లింగము గోధుమవన్నెగలిగి, మొత్తము పదు నెనిమిది యడుగుల యెత్తుండును. పార్థుడు కొట్టిన దెబ్బలు సూచించుట కన్నట్లు లింగము శిరస్సు ఎగుడు దిగుడుగా నుండును. ఉత్తరదిశలో మూలను ఊయెల మండపమున్నది. ఇది కదిపినచో నూగుచు ఆ కాలపుశిల్ప నిర్మాణనైపుణిని దెల్పును. ఆలయ పశ్చిమ ద్వారమునకు కొలదిదూరములో నొక పెద్ద రాతిస్తంభమును, దానిపై నొక నంది విగ్రహమును గలవు. భీమవరాగ్రహారము పాడుపడిన తరువాత నిట నొక గొల్లది స్వామికి నిత్యమును పాలు పెరుగులు నివేదన యిడెడిదనియు, నామె స్మృతి చిహ్నముగ నీ స్తంభము నిర్మింపబడెననియు దెల్పుదురు. శివరాత్రికి స్వామికళ్యాణాదులు జరుగును. ఇతర పర్వములలోగూడ భక్తు లభిషేకాదులకు ఆలయమునకు వత్తురు. భీమేశ్వరాలయమునకు పశ్చిమమున రెండు ఫర్లాంగుల దూరములో రాజనారాయణస్వామి ఆలయ మున్నది. ఇది విష్ణ్వాలయము. ఇందలి మూర్తి మాండవ్య నారాయణస్వామి. ఇందలి విష్ణువిగ్రహము క్రింద పరసువేదియుండెననియు, దానిని దొంగిలింపనొక చోరుడు యత్నింప వానిచేయి యం దంటుకొనిపోయెననియు, వాడు స్వామిని ప్రార్థింప చేయి యూడివచ్చెననియు స్థలపురాణగాథ చెప్పుదురు.
వ్యాసుడు ఈశ్వరునిచే వెడలనడుపబడి కాశిని వీడి దక్షిణకాశియగు దక్షారామమున కేగుచు పీఠికాపురము
646