చరిత్ర రచనారీతుల వికాసము
సంగ్రహ ఆంధ్ర
పిదప గియోవాన్ని బట్టిస్టవైకో (Giovanni Battista Vico - 1688-1744), మాంటెన్క్యూ (Montesquieu -1689-1745), వాల్టేర్ (Francoise Marie Aronet commonly called Voltaire - 1694-1778) మున్నగు వారి రచనలు ప్రజాదరణమునువడసి వ్యాప్తిలోనికి వచ్చు వరకును చరిత్రరచన రణరంగమును వీడి పఠనమందిరమును ప్రవేశింపలేదు. తరువాత క్రమముగా డేవిడ్ హ్యూమ్ (David Hume - 1711-1776), విలియం రాబర్ట్ సన్ (William Robertson - 1721-1793), మైకేల్ ష్మిడ్ (Michael Schmidt-1736-1794), ఎడ్వర్డు గిబ్బన్ (Edward Gibbon - 1737-1794), ఆర్నాల్డ్ హీరెన్ (Arnold Heeren - 1760-1842), మున్నగువారు ప్రశస్తి గాంచిరి. కాని వీరి దృష్టిలో తత్త్వ జిజ్ఞాసకు చరిత్ర కేవలం మొక ఉపాంగము. తత్త్వబోధయందు చారిత్రక నిదర్శనములను చూపి సుస్పష్టము చేయుటయే వీరి ఆశయము. కాని తత్త్వమును గూర్చి మాత్రము వారికి సునిశ్చితమైన అభిప్రాయము కుదరలేదు.
ఈలోగా ఫ్రెంచి మహావిప్లవము బయలుదేరినందున చరిత్ర రచన ఆగిపోయెను. ఈ విప్లవముయొక్క హడావిడి సమసిపోయి మరల చరిత్రరచన సాగనారంభమగు నప్పటికి మానవదృక్పథమునందే మార్పు కలిగి, పూర్వ పద్ధతులయందు ఒక విపరీత విశ్వాసమును, ప్రేమాభిమానములును బయలు దేరెను. ఇవి కొంతకాలము వ్యాప్తియం దుండెను. ఇప్పటికి సుమారు వందసంవత్సరముల క్రిందటి వరకును శాస్త్రీయ చారిత్రక దృక్పథము అలవడలేదనియే చెప్పవచ్చును.
ఒక్క విషయమున మాత్రము అదివరకే చరిత్రరచనకు అవసరమైన కొంత అభివృద్ధి గాన్పించుచున్నదని చెప్పవచ్చును. ఈ అభివృద్ధి చారిత్రక ఆధారసామగ్రి ప్రచురణయందే గాన్పించుచున్నది. చరిత్ర స్వకపోల కల్పనా కల్పితము కాదు. చరిత్ర కాధారములు నిర్దుష్టముగ నుండిననేగాని సత్యచరిత్ర వ్యక్తము కాదు. ఈ ఆధార సామగ్రిని సేకరించి, జాగ్రత్తగ పరిశీలించి, పరిష్కరించి ప్రచురించుట చరిత్రరచనకు మూలాధారము. ఈ ప్రయత్నము జర్మనీ, ఫ్రాన్సు, ఇంగ్లండు మున్నగు దేశములం దంతటను కొంతకాలముగా జరుగుచు వచ్చినందువలననే పందొమ్మిదవ శతాబ్దమున సక్రమచరిత్ర రచన ఏర్పరచుటకు వీలు కలిగెను.
అప్పటికిని కార్లైల్ వంటి మహాశయులు చరిత్రరచనకు బూసుకొని, చరిత్రయనగా అది కేవలము మహాపురుషుల జీవితచరిత్రల సంపుటీకరణమే అని సిద్ధాంతము చేయుటకు సమకట్టిరి. ఇట్టివారు జనసామాన్యమును ఎంత మాత్రమును పరిగణించకపోయిరి. ప్రజాజీవితమును ఉదాసీనభావముతో చూచుచుండిరి. రాజులు, రాణులు, మహామంత్రులు, వారి పన్నాగములు, వారి హావభావ విలాసములు, యుద్ధములు, సంధులు మాత్రమే చరిత్ర రచనకు ప్రధానము లనియు, చరిత్ర యనగా కేవలము రాజకీయ చరిత్రయే అనియు వీరు భావించిరి. ఈ పాక్షిక దృక్పధమును ప్రతిఘటించి, రాజకీయచర్యలే చరిత్రయనుట తప్పు అని వక్కాణించి, రాజకార్యములు ఎల్లప్పుడును మహత్తర భావసంజనితములే కాబట్టి, భావ ప్రవాహ చరిత్రయే రాజకీయ, సాంఘిక, ఆర్థికచరిత్రకు కారణభూతమని వాదించి, ఫ్రెంచి మహావిప్లవ చరిత్ర రచనకు ఒక నూతన అధ్యాయమును కల్పించి, అందు భావనిర్ణయము ఏరీతిగ ఫ్రెంచి మహావిప్లవమునకు దారి తీసెనో నిరూపించుటకు ఆక్టన్ ప్రభువు (Lord Acton), అతని అనుయాయులును పూనుకొనిరి.
ఆక్టన్ ప్రభువు భావప్రాధాన్యమును ఉద్ఘాటించుచు ప్రచారము చేయదొడగిన కొలది, మార్క్స్‌సిద్ధాంతమును అనుసరించు సామ్యవాదలు ప్రతిఘటించి, మానవచరిత్రయంతయు కూడు, గుడ్డ, మున్నగు భౌతిక వస్తుసంచయము కొరకై జరుగు పోరాటము పైననే ఆధారపడి యున్నదని వాదింపసాగిరి. మరియు కొందరు కార్ల్ లాంప్రెక్ట్ (Karl Lamprect) అను జర్మను మన శ్శాస్త్రజ్ఞుని అడుగుజాడలలో నడచుచు మానవుని నైజమును, మానవసంఘ ప్రవృత్తియు, బుద్ధివైశద్యము పైన ఆధారపడియుండుట లేదనియు, హేతువాదమునకు విరుద్ధమైన చిత్తవృత్తిపైనను, చిత్తక్షోభముపైనను ఇది ఆధారపడి ఉన్నదనియు వాదింప సమకట్టిరి.
వీరందరకును పరిణామవాదము మాత్రము తప్పనిసరి ఆయెను. పరిణామవాదము పందొమ్మిదవ శతాబ్దమున ప్రతిపాదింపబడిన నూతన భావము కాదు. క్రమ
626