Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/676

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చరకుడు

సంగ్రహ ఆంధ్ర

6. కుసుమ : కుసుమగింజలపై పొట్టు గట్టిగను, దళసరిగను ఉండును. సాధారణముగా పొట్టు తీసిన పప్పు నుండి చమురు తీయుదురు. కుసుమ పప్పులో 32-37% చమురుండును. కుసుమనూనెకూడ ఆహార ద్రవ్యముగ నుపయోగింపబడుచున్నది. నీటినిపీల్చని గుడ్డలు తయారుచేయుటకును, బీరువాలకు అద్దములు, గోడలకు పలక రాళ్లు బిగించుటకు మక్కుగాకూడ కుసుమనూనె ఉపయోగించు చున్నది. కొన్నిరకముల కుసుమల పూవుల నుండి రంగు ద్రవ్యము తయారు చేయుదురు. కుసుమ ఏకవార్షిక సస్యము.

7. సీమ అవిసె (అవిసె) : అవిసె శోషకస్థిరతైలములనిచ్చు ఏక వార్షిక సస్యము. ప్రపంచమందు ఉత్పత్తియగు స్థిర, అస్థిరతైలములలో అవిసెనూనె రెండవ స్థానమును ఆక్రమించుచున్నది. అవిసెగింజలలో 35-45% చమురుండును. అవిసెనూనె రంగులు, వార్నీషులు, 'లినోలిన్' అనబడు తైలామ్లగ్లిసరిదము తయారు చేయుటకును, నీటిని పీల్చని గుడ్డలు, అచ్చు సిరాలు తయారు చేయుటకును విస్తారముగా ఉపయోగింపబడు చున్నది.

8. ప్రత్తి : ప్రత్తినుండి కేవలము దూదియేగాక, గింజలనుండి చమురుకూడ లభించును. ప్రత్తిగింజలలో చమురు 15-30% వరకుండును. ప్రత్తిగింజలనూనె సబ్బు చేయుటకు చాల అనుకూలముగా నుండును.

9. కొబ్బెర : అశోషక స్థిరతైలముల నిచ్చు బహువార్షిక వృక్షజాతులలో కొబ్బెర ప్రధానమైనది. ఎండబెట్టిన కొబ్బెరనుండి చమురు తీయుదురు. కొబ్బెరనూనె శీతకాలపు చలికి పేరుకొనును. కొబ్బెరనూనె ఆహారముగను, లేపనముగను, తలచమురుగను విస్తారముగ ఉపయోగములో నున్నది. కొబ్బెరలో 60-65% చమురుండును. కొబ్బెరనూనె వనస్పతిపరిశ్రమకు ఉపయోగింప తగినది. ఇది సబ్బులు, క్రొవ్వొత్తులు చేయుటకు గూడ శ్రేష్ఠమైనది. వైద్యులు కొన్ని రకముల తైలములను తీయుటకు దీని నుపయోగింతురు.

బి. వి. ర.


చరకుడు :

అష్టాంగ విశిష్టమగు పాతంజల యోగ శాస్త్రమును అష్టాధ్యాయాత్మకమగు పాణినీయ వ్యాకరణ మహా భాష్యమును, అష్టాంగ సముజ్జ్వలమగు ఆయుర్వేద సిద్ధాంతసంగ్రహమును రూపొందించిన పతంజలి మహర్షియే చరకుడని ప్రసిద్ధిగలదు.

ఈతనిచే సంగృహీతము లగు యోగ, వ్యాకరణ, ఆయుర్వేద శాస్త్రములు మూడును అష్టాంగములు గలవిగనే యున్నవి. చరకుడుగా వాడుకగనిన ఈ పతంజలి మహర్షి మద్ర రాజ్యనివాసి. రాజర్షి యగు జనకుని మహాధ్వరమందు అధ్యాత్మ విద్యాప్రబోధ మొనర్చిన యాజ్ఞవల్క్య మహర్షికి ఈతడు సమకాలికుడు. యాజ్ఞ వల్క్యుని ప్రతి ద్వంద్వియగు భుజ్యుమహర్షి ఖిలములగు వేద వేదాంగ విజ్ఞానభాగములను సేకరించుటకు దేశములు సంచరించుచు పతంజలి మహర్షి ఇంటికి వెళ్లె ననుటకు శుక్లయజుర్వేదీయ బృహదారణ్యకము ప్రమాణముగా నున్నది.


“అథ హైనం భుజ్యుర్లాహ్యాయనిః యాజ్ఞవల్క్యేతి
 హోవాచ. మద్రేషు చరకాః పర్యవ్రజామ తే
 పతంజలస్య కావ్యస్య గృహానైమ.”
                          —శుక్లయజుర్వేదీయ. బృహ. ఆ. 3; బ్రా. 3.

పతంజలియే చరకు డనుటకు యోగవార్తికమున విజ్ఞానభిక్షువు,


యోగేన చిత్తస్య పదేన వాచాం
          మలం శరీరస్య చ వైద్యకేన
యో౽పాకరోత్తం ప్రవరం మునీనాం
          పతంజలిం ప్రాంజలి రానతోస్మి.

"యమ నియమాసనాద్యష్టాంగ యోగశాస్త్రమున మనోమాలిన్యమును, వ్యాకరణమహాభాష్యమున వాజ్మాలిన్యమును, పంచకర్మ రసాయన వాజీకరణాభ్యాసములచే ఆయుర్వేదమున శరీరమాలిన్యమును తొలగించిన మహర్షి ప్రవరుడగు పతంజలిని ప్రాంజలిపై నమస్కరించుచున్నాను” అని నుడివెను. నేటివర కిట్లే యోగవ్యాకరణ వైద్యాచార్యులు శాస్త్రారంభములందు పతంజలిని ధ్యానించుట ఆచారముగా నున్నది

కాలవశమున మరుగుబడి, ఆ నోట ఆ నోట కొరుకుడుబడి, అదృశ్యములై, అపభ్రంశములై, ఖిలములగు వేద వేదాంగ పురాణేతిహాస విద్యలను, కళలను జాతీయ విజ్ఞాన సముద్ధరణోద్యుక్తులను విజ్ఞులు ఆయా కాలముల

616