విజ్ఞానకోశము - 3
చమురుగింజలు
తరగతులుగ విభజింపవచ్చును. శోషకతైలములను ఏ వస్తువునకైన పూసినచో, అవి త్వరలో ఆరిపోయి, ఆ వస్తువు పొడిగా నుండును. అశోషకతైలములు ఇట్లు త్వరలో ఆరిపోక, ఆవస్తువు చాలకాలము జిడ్డుగా నుండును. ఈ మూడు తరగతులలోగల వివిధరకముల చమురు లీ దిగువ నీయబడినవి.
1. అశోషకస్థిరతైలముల నిచ్చు జాతులు : వేరుసెనగ, ఆముదము, కొబ్బెర, నూవు, వెర్రినూవు, కుసుమ, ఆవ, జీడిమామిడి, ప్రత్తి, సోయ, అనుము, ముల్లంగి, ఇప్ప, మొక్కజొన్న అంకురములు, వేప, బూరుగ, ఆలివ్, బాదం, అక్రోటు, నేపాళం మొదలగునవి.
2. శోషకస్థిరతైలముల నిచ్చు జాతులు : సీమ అవిసె, పొగాకు, గసగసాలు, గంజాయి, సూర్యకాంతము, అడవిగోరింట, పొన్న, జాజి, బ్రహ్మదండి, ద్రాక్ష, గుమ్మడిగింజలు మొదలగునవి.
3. అస్థిరపరిమళ తైలముల నిచ్చు జాతులు: చందనము, దేవదారువు, హారతి కర్పూరము, వట్టివేళ్లు, నిమ్మగడ్డి, కామంచిగడ్డి, యూకలిప్టస్, గులాబి, మల్లె, నారింజజాతులు, మొగలి, గుల్షబ్, మాలతి, లవండరు, లవంగము, ఏలకులు, మిరియాలు, జాపత్రి, పుదీనా, దాల్చిని, జీలకర్ర, వాము, అల్లపుగడ్డి, పెప్పర్మెంటు మొదలగునవి.
పై తరగతులలో పేర్కొనిన కొన్ని ముఖ్యమగు చమురు దినుసులు గింజలను, వాటినుండి లభించు చమురులను గూర్చి ఈదిగువ చెప్పబడినది.
1. వేరుసెనగ : ఇది పారిశ్రామికములయిన చమురు దినుసులలో ముఖ్యమైనది. వేరుసెనగ వార్షిక సస్యము. వేరు సెనగనూనె ఆహారయోగ్యమైనది. ఇది వనస్పతి పరిశ్రమయందును, సబ్బు పరిశ్రమయందును, హెచ్చుగా ఉపయోగింప బడుచున్నది. ఈ నూనెను కొంతవరకు దీపములకును, తోళ్ళపరిశ్రమయందును ఉపయోగింతురు. వేరుసెనగ గింజలనుండి 'ఆర్డైల్' అను నొక విధమగు నారను రసాయనిక విధానమున తీయుదురు. వేరుసెనగ గింజలనుండి సాధారణముగా 45-50% చమురు దిగుబడి యగును.
2. ఆముదము : ఇది ఆహారయోగ్యము కాకపోయినను దీనికి పారిశ్రామికముగ ప్రాముఖ్యము మెండు. దీపమున కుపయోగించదగిన చమురులలో ఆముదము శ్రేష్ఠమైనది. సాగుయందున్న ఆముదములు ఏకవార్షిక సస్యములు. ఆముదపు గింజలలో సాధారణముగా 45-50% చమురు ఉండును. ఆముదమునకు తక్కిన సామాన్య స్థిరతైలములకంటె, స్నిగ్ధత, తారతమ్య గరిమ హెచ్చుగానుండును. అందుచే, వివిధ యంత్రముల కిది కందెనగా ఉపయోగింప బడుచుండును. ఆముదము, సబ్బు పరిశ్రమల యందును, క్రొవ్వొత్తుల పరిశ్రమ యందును, కృత్రిమమగు రబ్బరు, తోలు, తయారు చేయుటయందును, తలనూనె తయారుచేయుట యందును వైద్యమునందును, తోలువస్తువులకు లేపనముగను, కొంతవరకు ఉపయోగపడుచున్నది.
3. నూవు : నూవుకూడ ఏక వార్షికసస్యమై యున్నది. నూవుగింజలలో 43-49% వరకు చమురుండును. నూవుల నూనె ఎక్కువగా ఆహారముగ వినియోగపడుచుండుటచే, పరిశ్రమలలో దీని వాడుక చాల తక్కువగ నున్నది. తలనూనెల పరిశ్రమల యందును, వివిధ పుష్పముల యందలి అస్థిర తై లములను సంగ్రహించుటకును నూవుల నూనె తరచుగా నుపయోగింప బడుచున్నది. సబ్బులను తయారు చేయుటకు నూవులనూనె అనుకూలమైనది.
4. ఆవ : ఆహారయోగ్యమగు తైలసస్యములలో ఆవ మరియొకటి, పొట్టుతీయని ఆవగింజలనుండియే చమురు తీయుదురు. ఆయా రకములనుబట్టి ఆవాలలో 15-45% వరకు చమురుండును. ఆవాలు సంబార ద్రవ్యముగ కూడ ఉపయోగములో నున్నవి. ఆవ నూనె పరిశ్రమల యందుపయోగింప బడుట చాల తక్కువ. ఇదికూడ సబ్బులు చేయుటకుపయోగించును. దీపములకొరకీ నూనె కొంత వాడుకలో నున్నది.
5. వెర్రి నూవు : నూవులవలెనే వెర్రినూవులు కూడ చమురునిచ్చుగింజలు . వెర్రినూవుకూడ ఏక వార్షికసస్యము. ఈ నూనె కొంతవరకు ఆహారముగను, దీపములకును ఉపయోగింపబడుచున్నది. కొంతవరకు సబ్బు పరిశ్రమయందును, యంత్రభాగములకు కందెనగాను ఇది వాడుకలో నున్నది. వెర్రి నూవులలో సుమారు 35-40%. చమురుండును.
615