విజ్ఞానకోశము - 3
చతురంగబలములు - 1
క్రిందనుండి సాహసోపేతులై యుద్ధము గావించుచుందురు. కూపతీర్థాదులను శోధించుట, శిబిర సన్నివేశములకును, శత్రుస్థావరములయొక్కయు మార్గముల నన్వేషించుట, గుడారముల నిర్మాణము, కోశాగారము, ఆయుధాగారము, ధాన్యాగారము మొదలగు వాటిని రక్షించుట, వ్యూహాదులను రచించుట, మొదలగునవి పదాతి కర్మలని చెప్పబడినది.
ఈ పదాతులే ముఖ్యముగా ఆ యా కాలములలో అమలులోనుండిన ఆయుధములను ధరించి అందు సుశిక్షితులయి యుందురు. శిరస్త్రాణము, కవచము, కత్తి, డాలు మున్నగు రక్షక పరికరములను ధరించి, యుద్ధాలంకార శోభితులయి, వీరాలంకరణములు కలవారై, తారసిల్లుదురు ! వారు -
'బలవంతస్సత్త్వవంతో, మర్మజ్ఞాః సూక్ష్మవేధినః,
యుద్ధ భూమి విభాగజ్ఞా, దుర్లభాస్తే పదాతయః
(హ. హ. చ.)
అని బలసత్త్వవంతులును, మర్మజ్ఞులును, సూక్ష్మవేధులును, యుద్ధభూమి విభాగజ్ఞులునగు పదాతులు దుర్లభులని యుద్ధశాస్త్రము !
ఇట్టి రథ - గజ - తురగ - పదాతులు అను చతురంగబలములతో గూడిన సేన ప్రాచీన భారతదేశమునందలి యుద్ధభూముల నలంకరించినది.
బలవివరణము : భారతీయులు రథ - గజ - తురగ - పదాతి దళములను, పత్తి సేనాముఖము, గుల్మము, గణము, వాహిని, పృతన, చమువు, అనీకిని, అక్షౌహిణి అని తొమ్మిది విధములుగా విభజించిరి. పత్తియను విభాగము నందు ఒక రథము, ఒక గజము, మూడశ్వములు, అయిదుగురు కాలిబంట్లు ఉందురు. 3 పత్తులు, ఒక సేనా ముఖము; 3 సేనాముఖములొక గుల్మము; 3 గుల్మము లొక గణము; 3 గణములొక వాహిని; 3 వాహిను లొక పృతన; 3 పృతనలొక చమువు; 3 చమువులొక అనీకిని; 10 అనీకినులు ఒక అక్షౌహిణి అనబరగును. ఈ విభాగములు ఈ కాలమునందలి బెటాలియనులు, రెజిమెంట్లు, కంపెనీలు - ఇత్యాది సేనావిభాగములను పోలియున్నవి.
ఇక ఈ లెక్కప్రకారము ఏ యే సైనిక విభాగ బల మెట్లుండునో దిగువ చూపబడినది :
పటాలము పేరు | రథములు | గజములు | అశ్వములు | పదాతులు |
1. పత్తి | 1 | 1 | 3 | 5 |
2. సేనాముఖము | 3 | 3 | 9 | 15 |
3. గుల్మము | 9 | 9 | 27 | 45 |
4. గణము | 27 | 27 | 81 | 135 |
5. వాహిని | 81 | 81 | 243 | 405 |
6. పృతన | 243 | 243 | 729 | 1215 |
7. చమువు | 729 | 729 | 2187 | 3645 |
8. అనీకిని | 2187 | 2187 | 6561 | 10935 |
9. అక్షౌహిణి | 21870 | 21870 | 65610 | 109350 |
ఈ తొమ్మిదింటిలో అన్నిటికంటె చిన్నది "పత్తి" అను పటాలము. అన్నిటికంటె పెద్దది అక్షౌహిణి అనునది. ప్రతి పటాలమునకు ఒక అధిపతి యుండుచుండెను. ఆ అధిపతులను పత్తిపాలకుడు, సేనాముఖుడు, గౌల్మికుడు, గణపతి, వాహినీపతి, పృతనాపతి, చమూపుడు, అనీకినీపతి, అక్షౌహిణీపతి అనుచుండిరి. అనీకినీపతి మహాభారతములో సేనాప్రణేతరుడుగా పేర్కొనబడినాడు. వీరందరు సమర పండితులు. కౌరవుల పక్షమున 11 అక్షౌహిణుల సైన్యము, పాండవులకు 7 అక్షౌహిణుల సైన్యము ఉన్నట్లు మహాభారతము తెలుపుచున్నది. ప్రాచీన హిందువుల ఈ సేనావిభాగ పద్ధతి వారి కుశాగ్రబుద్ధికి, సేనావ్యవస్థా ప్రణాళికా విధానమునకు తార్కా ణముగా నుండగలదు.
చతురంగబలములను నడిపెడు ముఖ్యయోధుడు వైదిక వాఙ్మయములో 'సేనాని' అనబడెను. 'సేనాని' అను పదము తరువాత 'సేనాపతి' అను పదముగా మారెను. సేనాపతికి తరువాత పేర్కొనదగిన యుద్ధాధికారి సేనా ప్రణేతరుడుగా చెప్పబడెను. ఇతడు దండనాథు డనియు వ్యవహరింపబడెను. ఈ ఇద్దరిలో ఒక్కొకడు ఒక అక్షౌహిణీ సైన్యమునకు అధిపతిగా నుండు చుండెను. ఈ సేనాపతులలో నుండి ఒకడు నాయకాగ్రేసరుడుగా ఎన్నుకొనబడు చుండెను. ఇట్టివానిని 'మహా సేనాపతి' అను ప్రముఖనామముతో పేర్కొనుచుండిరి. ఇట్టి అధికారిని విజయనగర సమ్రాట్టులు 'సర్వసైన్యాధికారి' అనిరి.
597