Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/656

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతురంగబలములు - 1

సంగ్రహ ఆంధ్ర

గించు వాడుక అథర్వ వేదకాలమునుండియు తెలియు చున్నది. శ్రీమద్రామాయణమున -


'కాంభోజవిషయే జాతై ర్బాహ్లికైశ్చ హయో త్తమైః
వనాయుజైర్నదీజైశ్చ, పూర్ణా హరిహయోత్తమైః'
                                              (రా. బా. 7 స.)

అని గుఱ్ఱములు కాంభోజ - బాహ్లిక -వనాయు-సింధు దేశములలో పుట్టినట్లును, అవి భారతదేశమున ఉపయుక్తము లైనట్లును తెలియగలదు. కాని భారతదేశమునందలి అశ్వజాతియంతయు విదేశీయ మనుట న్యాయముకాదని కొందరభిజ్ఞులు అభిప్రాయ పడుచున్నారు. సేనలో అశ్వ సేనయొక్క ఆవశ్యకతనుగూర్చి చెప్పుచు -'యస్యాశ్వాస్తస్య మేదినీ' - (అశ్వబలము గలవానిదే భూమి) అనియు-


'శక్య మశ్వసహస్రేణ కృత్స్నాం జేతుంవసుంధరాం
న యచ్ఛక్యం గజైర్జేతుం పత్తిభిర్వా ప్రహారిభిః'
                                           (హ. హ. చ. 3.)

అన్నట్లు గజపదాతి బలములచే జయింపరాని దెల్లను అశ్వబలముచే గెలువవచ్చుననియు, చెప్పబడుటచే దాని ప్రాశస్త్యమును సులభముగా గుర్తింపవచ్చును.

ప్రాచీన భారతమున అశ్వశిక్షనుగూర్చి తెల్పు శాస్త్రములు పెక్కులున్నట్లు తెలియనగుచున్నది. అశ్వాయుర్వేదము, అశ్వశాస్త్రము, అశ్వచికిత్సితము మొదలగునవి లక్షణ ప్రకాశములో పేర్కొనబడినవి. వాటినిబట్టి అశ్వబలమును గూర్చిన విశేషాంశము లెన్నియైనను తెలియవచ్చుచున్నవి.

అశ్వదళమునందు చేర్చుకొనునప్పుడు గుఱ్ఱముయొక్క వయస్సు, బలము, పరిమాణము, సలక్షణత మొదలగు నంశములు విచారించి స్వీకరించెడివారు. పరిపాలనాంగమున అశ్వరక్షణమున కొక శాఖయే యున్నట్లు అర్థశాస్త్రము చెప్పుచున్నది.


'తతః సంనోదయామాస,హయా నాశు త్రిహాయనాన్'
                                              (మ. భా. ద్రో. ప.)

అన్నట్లు అభిమన్యుని గుఱ్ఱములు మూడేండ్ల వయస్సు గల్గిన వని చెప్పబడినది. యుద్ధాశ్వమునకును రథాశ్వమునకును భేద మున్నట్లు కన్పట్టును. గుఱ్ఱములకు, ఏనుగులకు వలెనే ప్రత్యేకముగా పేర్లు పెట్టుకొని వ్యవహరించు వాడుక యున్నది. ఆశ్వికుడు (గుఱ్ఱపు రౌతు) దానిపై నెక్కి, తన చేతిమణికట్టున కొక కొరడాత్రాడు కట్టుకొని కూర్చుండి దానితో అవసరము కల్గినప్పుడు అదలించు చుండును. అందుకే అతని చేతులు వట్టివిగా నుండి, ఖడ్గ -బాణాది—ప్రయోగములను నిరాటంకముగా నిర్వహింప గలవు. 'రౌతులు అశ్వశిక్షలో యుద్ధప్రక్రియ లన్నియు నేర్చి, శత్రుసేనలను సూటిగా నెదుర్కొనుటకును, పారిపోవువానిని వెంటాడుటకును, తన సైన్యపు పార్శ్వములను రక్షించుకొనుటకును, యుద్ధవార్తలను దేశమందంతట రహస్యముగా చేరవేయుటకును, శత్రుసేనను చీల్చి త్రోసికొని చెండాడుటకును అశ్వసేన నుపయోగింతురు. దుర్గారణ్యమందలి సేనారక్షణమున కీ అశ్వదళ మెంతో ఉపయోగకారి. ఎందుకు? వేగ - సాహస మవసరమగుపట్ల అశ్వదళమే విజయసాధకమని భారతీయులఅభిప్రాయము.

పదాతిబలము : ఇక సేనకు నాల్గవ అంగము పదాతి బలము. దీనినే మనము 'కాల్బలము' అందుము.


“సేనా పదాతిబహులా, శత్రూన్ జయతి సర్వదా”
                                             (అగ్నిపురాణము)

అన్నట్లు పదాతిబలపు ప్రాశస్త్యము చెప్పబడినది. మరియు


“యుధ్యంతే పత్తయస్సర్వే ప్రజ్ఞయైవ స్వకీయయా"
                                                    (హ. హ. చ )

అనుటచే పదాతులు గజాది బలమువలె గాక తమ సొంత ప్రజ్ఞచే ప్రవర్తించి జయము సాధింపగలరు. రథాదిబల ముపయోగింపని -


“దుర్గయుద్ధే రాత్రియుద్ధే, ప్రశస్యంతే పదాతయః
యత్రగంతుం వనే, శైలే, పత్తయ స్తత్ర యోధినః"
                                               (హ. హ. చ.)

అన్నట్లు దుర్గ, వన, పర్వత యుద్ధములలోను, రాత్రి యుద్ధమునందును, పదాతిబలమే శ్రేష్ఠమని చెప్పదగును. అట్టి పదాతిసైనికులు, మౌలసైనికులు (ఆనువంశికముగా నుండువారు), భృతసైనికులు (వేతనమునకై చేరినవారు), శ్రేణీసైనికులు (ప్రజాసంఘముల నుండి వచ్చి చేరినవారు), మిత్రసైనికులు (సామంతాదులచే పంపబడిన వారు), అమిత్రసైనికులు (శత్రు సేనను విడిచివచ్చి చేరినవారు). ఆటవిక సైనికులు (అడవిజాతులవారు) అన్నట్లు వివిధరీతులుగా ఆ బలములో చేరి యుద్ధ మొనర్తురు. వారును తగిన శిక్షణమును పొంది తగిన పరిపాలనాశాఖ

596