Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/650

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంపూకావ్యములు (సంస్కృతము)

సంగ్రహ ఆంధ్ర

పూజ్యపాదులగు నాథముని, రామానుజాచార్యులు, వేదాంత దేశికులు మున్నగు మహాపురుషుల చరితములు చంపూకావ్యములై వెలసినవి. వల్లీ సహాయకవి 'ఆచార్య దిగ్విజయ' మను చంపువును రచించెను. ఇందు జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులు, ఆనందగిరి ప్రభృతి శిష్యులను వెంటగొని, మధ్యార్జున క్షేత్రము మొదలుకొని కాంచీనగరము వరకు గల మహాక్షేత్రములను దర్శించి, ప్రతివాది మత నిరాకరణ పురస్సరముగ అద్వైతమత స్థాపన మొనర్చి దిగ్విజయమును గాంచినవిధ మత్యుదాత్తముగ వర్ణింపబడినది.

సంఘ విమర్శనవర చంపువులు : కొందరు కవులు సంస్కృత చంపువును సంఘ గుషదోష విమర్శనమునకు సాధనమునుగా గ్రహించిరి. తాదృశులలో శ్రీశైలం అన్యయార్యు డొకడు. ఇతడు కోనల వేంకటరాజు నాస్థానకవియై వరలెను. ఇతడు తత్త్వగుణాదర్శ చంపువును రచించెను. స్వీయ తమోగుణము కారణముగా శాంభవులు తత్త్వబోధమును పొందజాలరు. స్వీయ సత్త్వగుణము కారణముగా వైష్ణవులు తత్త్వావగతిని పొందుదురు అని ఈ చంపువునందు కవి తెలిపెను. కాంచీమండల వాసియగు వేంకటాధ్వరి (1650) బహుగ్రంథ నిర్మాతగా విఖ్యాతినొందెను. 'విశ్వగుణాదర్శ చంపువు' 'వరదాభ్యుదయ చంపువు', 'ఉత్తరచంపువు', 'శ్రీనివాసచంపువు' అను నాలుగు చంపువుల నీ కవి రచించెను. విశ్వగుణాదర్శ చంపు వీకవి కీర్తిసౌధమునకు మూలస్తంభము. ఇది యొక స్వతంత్రకావ్యము. ఇందు శ్లోకముల మధ్యనున్న గద్యము మిక్కిలి పరిమితమైనది. ఈ చంపువు 'శ్రీరాజీవాక్ష వక్షఃస్థలనిలయ రమాహస్త వాస్తవ్య లోలత్ ' అను నాశీర్వాద మంగళముతో నారంభింపబడినది. ఈ కవి రఘునాథదీక్షితుని కొడుకు, తర్క వ్యాకరణ మీమాంసా శాస్త్ర నిష్ణాతుడు, అని గ్రంథారంభమునందలి ...... 'శ్రీరఘునాథదీక్షితకవిః పూర్ణో గుణై రేధతే' 'తత్సుత స్తర్క వేదాంత తంత్రవ్యాకృతి చింతకః' అను శ్లోక పాదములచే అవగతమగుచున్నది. గ్రంథ కారణ మిట్లు నుడువబడినది. కృశాను విశ్వావసు నామకులగు నిరువురు గంధర్వులు ప్రపంచమును దిలకించుటకొరకు విమానా రూఢులై ఆకసమున సంచరించుచు, ఉత్తరమున బదరికాశ్రమము మొదలుకొని దక్షిణమున సేతుపర్యంతము గల ఘూర్జర - మహారాష్ట్ర - ఆంధ్ర కర్ణాట, పాండ్య చోళదేశములను, మహాక్షేత్రములను, పుణ్యనదులను, అయోధ్యా - కాశ్యాది నగరములను వీక్షించుచు నేగు చుందురు. కృశాను నామకుడు తావీక్షించిన ఆయాస్థానము లందలి దోషములనే ఆవిష్కరించును. విశ్వావసు నామకుడు ఆయా తావులందలి గుణములనే ప్రకటించును. ఇట్లీ గంధర్వు లిరువురును తమ సంచారమును ముగించుకొని స్వస్థానమున కేగుదురు. యాత్రాంతమున కృశాను నామకుడు-


దార్ఢ్యాయ గుణసమృద్ధేః
దూషణ భణితి స్సమస్తవస్తూనాం
అస్మాకముపనిబద్ధా
సిద్ధాంత స్యేవ పూర్వ పదోక్తిః.

అని నుడువును. కవియొనర్చిన ఆంధ్రకర్ణాటాది దేశ వర్ణనము మనోజ్ఞము.


“నిగమపాఠ నిరాకృత దుష్కృతాం
 నయవిదో బహవో౽త్ర ధరాసురాః
 ప్రతివసంతముపాత్త మఖాస్సుఖం
 ప్రతివసంతి ముకుందపరాయణాః"

అనుదానియందు కృష్ణాగోదావరీ నదీమధ్యగత దేశవాసులగు బ్రాహ్మణుల వేదాధ్యయనపరతను, నీతిసంపత్తిని, యజ్ఞనిర్వహణ ప్రీతిని శ్రీహరిచరణ సేవాసక్తిని కవి వర్ణించెను. అట్లే కర్ణాటదేశమునందలి సౌందర్యసౌభాగ్య సమృద్ధుల నిట్లు మన కన్నులయెదుట బెట్టినాడు కవి—


ప్రతినగర మహారామాః
ప్రత్యారామంపచేలిమాః క్రముకాః
ప్రసవాః ప్రతిక్రముకమ
ప్యుత్సరతి మధుతతిః ప్రతిప్రసవం.

ప్రతిమధుబిందు మిళిందాః
ప్రేంఖంతి ప్రతిమిళింద మారావాః
ప్రత్యారామం సుదృశాం
మదా ఉదారాః ప్రతిమదం మదనః.

మరియు ఆ కాలమునందలి కొందరు జ్యోతిశ్శాస్త్రవేత్తల అసమగ్ర పాండితిని, కపట స్వభావమును, వైద్యుల కృత్రిమవృత్తిని, రాజసేవాపరాయణుల నీచవృత్తిని,

590